అర్ధరాత్రి వరకు కలెక్టరేట్‌లోనే సీఎం చంద్రబాబు!
posted on Sep 3, 2024 @ 11:31AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు కష్టం వచ్చిందంటే విలవిలలాడిపోతారు. వారి కష్టాలను తీర్చి సాధారణ జీవితం గడిపే వరకూ నిద్రాహారాలు మరచిపోతారు. అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా ఆయన తీరు అదే. గతంలో ఉత్తరాఖండ్ విలయంలో చిక్కుకున్న తెలుగువారిని స్వరాష్ట్రాలకు, వారి ప్రాంతాలను పంపించేందుకు చంద్రబాబు పడిన తపన చేసిన కృషి ఇప్పటికీ అందరికీ గుర్తుండిపోతుంది.
వారి కోసం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆయన అధికారంలో లేరు. విపక్ష నేత. ప్రజలను ఆదుకునే విషయంలో ఆయనకు రాజకీయాలతో పని లేదు. ప్రజల క్షేమమే ముఖ్యం. ఇక విశాఖను హుద్ హుద్ తుపాను అతలాకుతలం చేసిన సమయంలో కూడా రోజుల తరబడి విశాఖలోనే బస చేసి, విశాఖ కలెక్టరేట్ నే తన సెక్రటేరియెట్ గా మార్చుకుని బస్సులోనే విశ్రాంతి తీసుకుంటూ సహాయ, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించిన సంగతీ తెలిసిందే.
ఇప్పుడు బెజవాడను కనీవినీ ఎరుగని వరద ముంచెత్తిన ఆపత్సమయంలోనూ చంద్రబాబు నిద్రాహారాలను పట్టించుకోకుండా బెజవాడలోనే మకాం వేసి సహాయ, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం (సెప్టెంబర్ 1) అర్థరాత్రి నుంచీ ఆయన నిర్విరామంగా వరద బాధితులను ఆదుకోవడంలోనే నిమగ్నమయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటనలు చేస్తూ, కలెక్టరేట్ లో సమీక్షలు నిర్వహిస్తూ, ఎప్పటికప్పుడు అధికారులకు దిశా నిర్దేశం చేస్తూ అవిశ్రాంతంగా గడిపారు. సోమవారం (ఆగస్టు 2)న కూడా ఆయన అదే పని చేస్తూ గడిపారు.
సోమవారం అర్ధరాత్రి 2 గంటల వరకూ ఆయన విజయవాడ కలెక్టరేట్ లోనే ఉండి సహాయక చర్యలు, వరద నిర్వహణపై పర్యవేక్షించారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు, అధికారులు కూడా ఉన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలకు ఆహారం పంపిణీ, అవసరమైన చోట్ల సురక్షిత ప్రాంతాలను జనాల తరలింపు తదితర అంశాలను స్వయంగా పర్యవేక్షించి పనులు జరిగేలా చూశారు. ముంపు ప్రాంతాల ప్రజలకు హెలికాప్టర్ల ద్వారా ఆహారాన్ని అందేలా చూశారు. మరీ రిమోట్ ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా అహార పదార్థాలు, మందులను అందించారు.