కేసీఆర్ కు సీబీఐ భయం.. జనరల్ కన్సెంట్ రద్దుకు నిర్ణయం?
posted on Sep 2, 2022 @ 10:41AM
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనపై సీబీఐ నజర్ ఉందని భయపడుతున్నారా? తనపై లేదా తన కుటుంబ సభ్యులపై కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) దాడులు నిర్వహించే అవకాశం ఉందని భావిస్తున్నారా? అంటే ఆయన తీరు చూస్తుంటే ఔననే సమాధానమే వస్తుంది. అందుకే కేసీఆర్ రాష్ట్రంలో సీబీఐ జనరల్ కన్సెంట్(సాధారణ సమ్మతి) ను రద్దు చేయలని నిర్ణయించారు.
ఈ మేరకు ఏ క్షణంలోనైనా ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. ఆయనీ నిర్ణయం తీసుకున్నారనడానికి నిదర్శనంగా బీహార్ లో ఆయన మాటలను పరిశీలకులు ఉటంకిస్తున్నారు. ఒక్క తెలంగాణ అనే కాదు.. అన్ని రాష్ట్రాలూ సీబీఐ జనరల్ కన్సెంట్ ను రద్దు చేయాలని ఆయన తన బీహార్ పర్యటనలో పిలుపు నిచ్చారు. సీబీఐ జనరల్ కన్సెంట్ ను రద్దు చేయాలని కేసీఆర్ నిర్ణయించుకోవడానికి కారణం ఏ క్షణంలోనైనా తన కుమార్తె కవితపై సీబీఐ లిక్కర్ స్కాం కేసు నమోదు చేసే అవకాశాలుండటమేనని అంటున్నారు.
వాస్తవానికి చట్ట ప్రకారం సీబీఐ రాష్ట్ర ప్రభుత్వాల సిఫార్సుల మేరకే దర్యాప్తు జరుపుతుంద. ఓ రాష్ట్రంలో సీబీఐ తనంత తానుగా కేసులు నమోదు చేసి విచారణ చేయజాలదు. అయితే ఈ నిబంధన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై సీబీఐ .. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా దాడులు చేయవచ్చు. అయితే ఇలా చేయడానికి కూడా సీబీఐకి అన్ని ప్రభుత్వాలు జనరల్ కన్సెంట్ ఇవ్వాలి. ప్రతీ రాష్ట్ర ప్రభుత్వం సామాన్యంగా ఈ జనరల్ కన్సెంట్ ఇస్తుంది.
అయితే ఇప్పుడు సీబీఐ రాజకీయ అస్త్రంగా మారిందని బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న చోట్ల జనరల్ కన్సెంట్ రద్దు చేయడానికి ఆయా ప్రభుత్వాలు వెనుకాడటం లేదు. విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గత ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడు ఏపీలో సీబీఐకి ఇచ్చిన ఈ జనరల్ కన్సెంట్ ను రద్దు చేశారు. ఈ విషయంలో ఆయన బీజేపీ యేతర రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శనం చేశారు. అయితే అప్పట్లో బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్న కేసీఆర్ చంద్రబాబు సీబీఐకి జనరల్ కన్సెంట్ రద్దు చేయడాన్ని తప్పుపట్టారు.
చంద్రబాబు నిర్ణయంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. తప్పు చేయకపోతే భయమెందుకంటూ మాట్లాడారు. అయితే ఇప్పుడు తనదాకా వచ్చేసరికి కేసీఆర్ చంద్రబాబు అడుగుజాడల్లోనే నడవాలని నిర్ణయించుకున్నారు. అంతే కాదు తానే కాకుండా అన్ని రాష్ట్రాలు ఇదే చేయాలని పిలుపు కూడా ఇచ్చారు. బీజేపీ, మోడీకి వ్యతిరేకంగా పోరాడాలని భావిస్తున్న అన్ని ప్రాంతీయ పార్టీల నాయకులు, బీజేపీ యేతర ప్రభుత్వాల సీఎంలు ఇదే దారిలో నడవాలని కేసీఆర్ ఆకాంక్షిస్తున్నారు. సీబీఐకి తెలంగాణ ముఖ్యమంత్రి జనరల్ కన్సెంట్ ను రద్దు చేయాలన్న నిర్ణయాన్ని తప్పుపట్టలేం కానీ, గతంలో ఇదే పని చేసిన చంద్రబాబుపై విమర్శలు గుప్పించి.. తనదాకా వచ్చే సరికి అదే దారిన నడవాలని నిర్ణయించుకోవడం అవకాశ వాదం కాదా అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద కేసీఆర్ రాష్ట్రంలో సీబీఐకి సాధారణ సమ్మతిని రద్దు చేయడం ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.