వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై కేసు
posted on Nov 26, 2024 @ 9:40AM
వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై ఎర్రగొండపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక బాలిక విషయంలో చేసిన దుష్ప్రాచారానికి సంబంధించి అందిన ఫిర్యాదుపై చెవిరెడ్డిపై పొక్సో, అట్రాసిటీ చట్టాల కింద కేసు నమోదైంది. వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 4న తిరుపతి జిల్లా ఎర్రావారిపాళెం మండలానికి చెందిన బాలిక సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళుతుండగా.. కొందరు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన కలకలంరేపింది.
ఆ వెంటనే బాలికను ఆస్పత్రికి తరలించారు. ఇంతలో బాలికపై అత్యాచారం జరిగిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. వెంటనే రంగంలోకి దిగిన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు బాలికను పరామర్శించి, ఘటనపై ఆరా తీశారు. అయితే ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి బాలికను అడ్డుకుని.. ప్రేమించాలంటూ వేధించారని, వారిని అడ్డుకునే క్రమంలో బాలికకు గాయాలయ్యాయని ఎస్పీ తెలిపారు. వైద్యులు కూడా బాలికపై అత్యాచారం జరగలేదని ధృవీకరించారు. బాలికపై దాడికి పాల్పడిన వారినీ అదుపులోనికి తీసుకున్నారు. దీనిపై బాలిక తండ్రి తన కుమార్తె పై దుష్ప్రచారం చేశారంటూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.