సైడైపోయిన కార్యకర్తలు.. నీరుగారిన వైసీపీ సామజిక సాధికారిక యాత్ర!
posted on Nov 6, 2023 @ 12:52PM
గత ఎన్నికలలో వైసీపీ ఎంతటి ఘన విజయం దక్కించుకుందో.. ఈసారి ఎన్నికలలో అంతటి ఘోర పరాజయం తప్పదని సర్వేల ఫలితాలు లెక్కలేసి చెప్తున్నాయి. అదే సమయంలో వైసీపీ నేతలకు ఓటమి భయం కునుకు లేకుండా చేస్తున్నది. తెలుగుదేశం అధినేత చంద్రబాబును జగన్ సర్కార్ అక్రమంగా అరెస్ట్ చేయడంతో ఇక జనం ఎలాంటి మొహమాటాలూ లేకుండా తమ నిర్ణయం ఏమిటో వెల్లడించేస్తున్నారు. తాము ఎవరి వైపు ఉన్నామన్నది చెప్పడానికి వెనుకాడటం లేదు. దీంతో వైసీపీ స్థాయిలోపూర్తిగా డిఫెన్స్ లో పడిపోయింది. వైసీపీ అధిష్టానికి కూడా విషయం ఇప్పటికే బోధ పడగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీంను నమ్ముకొని ప్రజలలో నమ్మకం కలిగించేందుకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నది. లోలోపల ఓటమి ఖరారైన భయం వెంటాడుతున్నా.. పైకి మాత్రం మన బటన్ నొక్కుడే మనల్ని కాపాడుతుందని నేతలను, క్యాడర్ ను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల వద్దకు వెళ్లి మనం ఏం చేశామో అర్ధమయ్యేలా చెప్పండని ఆదేశిస్తున్నారు. ప్రభుత్వంతో పనిలేకుండా స్థానికంగా పనితీరు కలిగిన నేతలేమో ప్రజల వద్దకు వెళ్తుంటే.. సీఎంను నమ్ముకున్న నేతలకు ప్రజలలోకి వెళ్లేందుకు ధైర్యం సరిపోవడం లేదు.
వైసీపీ ఇప్పటికే గడపగడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమంతో మంత్రుల నుండి ఎమ్మెల్యేల వరకూ ఇంటింటికి వెళ్లారు. మా నమ్మకం నువ్వే అంటూ స్టిక్కర్లు అంటించే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమం కాస్తా ప్రజల ఆగ్రహాం తిరుగుబాటుతో చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాన్ని మమ అనిపించేశారు. అయినా వైసీపీ పెద్దలు సామజిక సాధికార యాత్ర పేరిట ఇప్పుడు మరోసారి వారందరినీ బస్సెక్కించి ప్రజల మధ్యకు పంపారు. ఈ యాత్రలో మంత్రి నుంచి వార్డు మెంబర్ దాకా.. పార్టీల అధ్యక్షుల నుండి వార్డు వాలంటీర్ దాకా అందరూ పాల్గొనాలని జగన్ ఆదేశించినా.. చాలా చోట్ల ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు ఈ యాత్రకు మొహం చాటేస్తున్నారట. అక్టోబర్ 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ వైసీపీ సామాజిక బస్సు యాత్ర ప్రారంభం అయ్యింది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాలలో ఒకేసారి యాత్రను ప్రారంభించారు. మూడు చోట్ల కూడా ఈ యాత్రకు ప్రజల నుంచి ఆదరణ లభించడం లేదు.
వైసీపీ బస్సు యాత్ర పట్ల ప్రజలలో కనీస స్థాయిలో కూడా స్పందన లేకపోవడంతో పార్టీ నేతలు కూడా ఈ యాత్రకు దూరం జరుగుతున్నారు. పైగా ఈ యాత్ర సాక్షిగా పార్టీలో అంతర్గత కుమ్ములాటలతో పాటు, వైసీపీ సర్కార్ లోపాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ఈ యాత్ర ద్వారా లాభం కంటే నష్టమే అధికమని వైసీపీ నేతలే అంటున్నారు. వైసీపీ పాలనను, ప్రభుత్వ వైఖరిని ప్రజలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, వ్యాపారులు.. ఇలా అన్ని వర్గాల వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. స్పష్టంగా చెప్పాలంటే అధికార పక్షానికి సానుకూలతకు మించి వ్యతిరేకత ఎక్కువగా ఉంది. ఈ యాత్ర ద్వారా ఆ వ్యతిరేకత మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
గత ఎన్నికల సమయంలో పనిగట్టుకొని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంపై వైసీపీ చేసిన దుష్ప్రచారం, కేంద్ర నుంచి సహాయ నిరాకరణ, జనసేన వేరుగా పోటీకి దిగడం, జగన్ పాదయాత్రలో ఇబ్బడి ముబ్బడిగా హామీలు ఇస్తూ ఒక్క ఛాన్స్ కోరడం.. కోడి కత్తి దాడి, వివేకా హత్య వంటి ఎన్నో కారణాలు కలిసి భారీ విజయం తెచ్చిపెట్టాయి. ఇప్పుడు అవే కారణాలు ఏపీ ప్రజలలో జగన్ పట్ల, ఆయన పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల ఆగ్రహానికి కారణమౌతున్నాయి. విపక్ష నేతగా జగన్ ఇచ్చిన హామీలు పది శాతం కూడా నెరవేరకపోవడం, రాజధానికి మరణ శాసనం రాయడం, పడకేసిన అభివృద్ధి, హద్దులు దాటిన నిరుద్యోగం వంటి ఎన్నో కారణాలు వైసీపీపై తీవ్ర వ్యతిరేకతకు కారణమవుతోంది. అలాగే కోడి కత్తి కేసులో బాధితుడు బయటకు రాకుండా ఉండేందుకు బాధితుడిగా జగన్ కనీసం కోర్టుకు వెళ్లి వాంగ్మూలం ఇవ్వకపోవడం, అసలా దాడిపైనే అనుమానాలు వ్యక్తం కావడం, అలాగే నాటి ఎన్నికలలో జగన్ పట్ల సానుభూతికి కారణమైన వివేకా హత్య కేసులో జగన్ సన్నిహితులే నిందితులని దర్యాప్తులో తేలుతుండటంతో నాడు జగన్ విజయానికి దోహదపడిన ఈ కారణాలే రానున్న ఎన్నికలలో జగన్ కు ప్రతికూలంగా మారనున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక పాలనా వైఫల్యాలు సరే సరి. దీంతో ప్రజలకు వద్దకు వెడుతున్న వైసీపీ నేతలకు నిరసనలు ఎదురౌతున్నాయి. అందుకే ఇప్పుడు ఈ సామజిక బస్సు యాత్రకు నేతలే మొహం చాటేస్తున్నారు. కార్యకర్తలూ సైడైపోతున్నారు. ఎవరికీ పట్టని యాత్రలా వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర సాగుతోంది.