ఆశలు ఆవిరైపోయయా?
posted on Dec 7, 2013 @ 2:52PM
కేంద్ర మంత్రివర్గం పదిజిల్లాల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ముసాయిదా బిల్లు రాష్ట్రపతి వద్దకు వెళ్ళిపోయింది. ఇక ఇపడు జరగాల్సిందల్లా తెలంగాణ ముసాయిదా బిల్లు రాష్ట్రపతి పరిశీలన తర్వాత రాష్ట్ర శాసనసభకు రావటం, సభ్యుల మనో అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టటం మాత్రమే మిగిలింది.
రాష్ట్ర శాసనసభ సమావేశాలను ఈ నెల 12 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రపతి బెంగాల్ పర్యటన తరువాత టీ బిల్లు ముసాయిదా రాష్ట్రానికి చేరుతుందంటున్నారు. అంటే 12 తేది లోపే బిల్లు వచ్చేస్తుందన్న మాట. అయితే పార్లమెంటు సమావేశాలు ముగిసే దాకా బిల్లుపై చర్చను సాగదీయాలని సమైక్యాంధ్ర నాయకత్వం ప్రయత్నాలు చేసినా ప్రయోజనం ఏమీ ఉండబోదని సీనియర్ నేతల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
బిల్లుపై చర్చ మాత్రమే జరుగుతుందని, అభిప్రాయ సేకరణ తప్ప ఓటింగ్ అనేది ఉండబోదని తేలిపోయిన స్థితిలో ఎవరెన్ని మాట్లాడినా కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వచ్చే ఢోకా ఏమీ ఉండదు. కేబినెట్ ఆమోదించినంత మాత్రాన రాష్ట్రం ఏర్పాటు అవబోదని కొందరు, శాసనసభలో మెజారిటీ సభ్యులు సమైక్యాంధ్రకు మద్దతు ఇస్తే దాని ప్రభావం బిల్లుపై పడుతుందంటూ ఇంకొందరు, న్యాయ పోరాటంలోనే తేల్చుకుంటామని, ఎలాగైనా విభజన ఆపుతామంటూ మరి కొందరు చేస్తున్న ప్రకటనలు, సవాళ్ళన్నీ అర్థం లేనివిగా రాజకీయ నిపుణులు కొట్టి పారేస్తున్నారు.
పార్లమెంటు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని తిరగదోడిన సందర్భాలంటూ ఏవీ లేవని, ఒకవేళ న్యాయపోరాటం చేయాలనుకుంటే రాజ్యాంగంలోని మూడవ అధికరణంపై చేయటమే తప్ప విభజన నిర్ణయంపై చేసే అవకాశమే లేదని రాజకీయ విశ్లేషకులు తేల్చేస్తున్నారు. సభలో ఎవరి అభిప్రాయాలు వారు చెప్పటం సహజమే అయినా అవన్నీ సభ రికార్డుల వరేక పరిమితం అవుతాయి తప్ప వచ్చే నష్టమేమీ లేదని వారంటున్నారు.