కొంప ముంచిన బుల్లెట్ సాంగ్.. ఉద్యోగం ఊస్టింగ్?
posted on Aug 21, 2021 @ 4:12PM
బుల్లెట్ బండెక్కి వచ్చేస్తప.. అందాల దునియానే చూపిస్తపా.. ఈ సాంగ్ కొన్ని రోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మంచిర్యాలకు చెందిన పెళ్లికూతూరు చేసిన ఈ డ్యాన్స్ వైరల్ గా మారింది. మంచిర్యాల జిల్లా గోదావరిఖనికి చెందిన సాయి అనే నవవధువు పెళ్లి అనంతరం భర్తను సర్‌ప్రైజ్ చేసేందుకు బరాత్‌లో ‘బుల్లెట్టు బండి’ పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది. ఈ వీడియో కాస్త నెట్టింట్లో వైరల్‌గా మారడం.. సాయి దంపతులకు ఫుల్ క్రేజ్ రావడం.. వెంట వెంటనే జరిగిపోయాయి. ఇంతటి క్రేజ్ సొంతం చేసుకున్న ‘బుల్లెట్టు బండి’ పాట ఇప్పుడు మరొకరి కొంప ముంచింది. ఉద్యోగానికే ఎసరు తెచ్చింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి పి హెచ్ సి లో బుల్లెట్ బండి పాట పై ఆస్పత్రి ప్రాంగణం లో ఓ నర్సు నృత్యం చేసింది. నవ వధులు చేసినట్లుగానే పాటకు అనుగుణంగా స్టెప్పులు వేసింది. హాస్పిటల్ లోని మిగితా సిబ్బంది అంతా కూర్చుని ఉండగా.. వాళ్ల మధ్యలో నర్సు బుల్లెట్ బండి సాంగ్ కు స్టెప్పులు వేసింది. ఆమె డ్యాన్స్ చేస్తుండగా మిగితా సిబ్బంది అంతా చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేశారు. నర్సు చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డ్యూటీలోనే నర్సు నృత్యాలు చేయడం వివాదంగా మారింది
నర్సు డాన్స్ కు నెటిజన్లు ప్రశంసలు ఇవ్వగా.. మరికొందరు ఆస్పత్రిలో ఈ డాన్సులు ఏంటని విమర్శలు చేశారు. దీంతో ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ సీరియస్ గా స్పందించారు. విచారణకు ఆదేశించారు.కలెక్టర్ ఆదేశాలతో డ్యాన్సు చేసిన నర్సుకు జిల్లా వైద్యాధికారి సుమన్ రావు మెమో జారీ చేశారు. ఆస్పత్రికి వెళ్లి ఆయన విచారణ జరిపారు. విచారణ తర్వాత చర్యలు ఉంటాయని తెలిపారు. దీంతో ఆ నర్సు కొలువుకు గండం వచ్చిందనే అనుకుంటున్నారు. మొత్తానికి సోషల్ మీడియాను షేక్ చేసిన బుల్లెడ్ బండి సాంగ్ క్రేజీ ఓ ఉద్యోగి పొట్ట కొట్టేదిగా మారిందనే చర్చ సాగుతోంది.