ఎన్డీయేలోకి బీఆర్ఎస్.. నిజమేనా?
posted on Feb 12, 2024 8:32AM
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది. అధికారంలో ఉండగా సాగించిన అడ్డగోలు దందాలన్నీ ఇప్పుడు ఒక్కటొక్కటిగా బయటపడుతుండటంతో కేసుల భయంతో వణికి పోతున్నది. పార్టీ శ్రేణులలో కూడా నాయకత్వంపై నమ్మకం సడలిపోతుండటంతో నేతలు ఒక్కరొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఎమ్మెల్యేలు సైతం కారు దిగిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక అధినేత కేసీఆర్ అయితే పూర్తిగా ఇంటికే పరిమితమైపోయినట్లుగా కనిపిస్తోంది. అడపాదడపా పార్టీ ముఖ్య నేతలతో భేటీలు, వచ్చే లోక్ సభ ఎన్నికలలో అనుసరించాల్నిన వ్యూహంపై దిశానిర్దేశం చేయడం తప్ప ఆయన పెద్దగా యాక్టివ్ గా వ్యవహరించడం లేదని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. ఇక పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అయితే నేతలను సముదాయించలేక దాదాపు చేతులెత్తేసిన పరిస్థితి.
దీంతో బీఆర్ఎస్ అగ్రనాయకత్వం దిక్కు తోచని స్థితిలో ఉంది. అండ కోసం వెతుకులాటలో పడింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఎన్డీయే గూటికి చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ ఉప్పూ నిప్పులా ఉన్న బీజేపీతో చెలిమి కోసం ఇప్పుడు బీఆర్ఎస్ తహతహలాడుతోందని అంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అండ ఉంటేనే ప్రస్తుత క్లిష్టపరిస్థితుల నుంచి బయట పడి పార్టీని కాపాడుకోగలుగుతామని బీఆర్ఎస్ అగ్రనాయకత్వం భావిస్తోందని అంటున్నారు.
అయినా రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న సంగతి ఇప్పటికే పలుమార్లు రుజువైంది. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీతో చెలిమి ద్వారా మరో సారి రుజువు కాబోతోందని అంటున్నారు. ఆ చెలిమిని లోక్ సభ ఎన్నికలకు ముందు పొత్తు ద్వారా ముడివేయాలని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోందని అంటున్నారు. అలా అయితేనే తమ ఎమ్మెల్యేలను-పార్టీని కాపాడుకోగలమని కేసీఆర్ భావిస్తున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు.
ఇక ఎన్డీయేలోకి కొత్త మిత్రులు వస్తారంటూ అమిత్ షా తాజాగా చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎన్డీయే కూటమిలోకి చేరుతుందనడానికి సంకేతంగా చెబుతున్నారు. ఇప్పటికే సామాజిక మాధ్యమంలో బీఆర్ఎస్ బీజేపీతో జట్టు కట్టేందుకు యూటర్న్ తీసుకోబోతోందంటూ పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్‌ఎస్ పొత్తు పొడుస్తుందన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో విస్తృతంగా జరుగుతోంది.
గతంలో అంటే తాను సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ విపక్షాలను బలహీనం చేయడానికీ, వీలైతే నిర్వీర్యం చేయడానికీ చేసిన ఆపరేషన్ ఆకర్ష్ ఇప్పుడు కేసీఆర్ ను భయపెడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆయన భయపడినట్లే పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టచ్ లోకి వెళ్లారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నియోజకవర్గ సమస్యలంటూ పార్టీకి సమాచారం ఇవ్వకుండా, పార్టీ అనుమతి తీసుకోకుండా ముఖ్యమంత్రి రేవంత్ ను కలవడం, ఇక పార్టీకి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో కొద్దో గొప్పో పరువు కాపాడిన గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు కూడా కారు దిగుతారన్న సంకేతాలు బలంగా వఃస్తున్నాయి. ఇటీవల అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ నిర్వహించిన ధర్నాకు గ్రేటర్ ఎమ్మెల్యేలందరూ డుమ్మా కొట్టడం కూడా వారంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న అనుమానాలకు బలం చేకూర్చింది. ఈ నేపథ్యంలోనే పార్టీని, పార్టీ ఎమ్మెల్యేలనూ కాపాడుకోవడానికి బీజేపీతో చెలిమి ఒక్కటే మార్గమన్న నిర్ణయానికి బీఆర్ఎస్ అధినేత వచ్చేశారని అంటున్నారు.