కృష్ణా జలాలపై కాంగ్రెస్ నోరు విప్పదా..!
posted on Dec 3, 2013 @ 3:27PM
కృష్ణానది మిగులు జలాల విషయంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంతమాత్రం కదిలించడం లేదు. ఈ తీర్పు ద్వారా తెలుగు వారికి అన్యాయం జరిగిందని దేశమంతటా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ, రాష్ట్రంలోని చాలా పార్టీలు, ప్రజలు ఈ తీర్పు పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నప్పటికి...కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దీనిపై నోరు విప్పే సాహసం చేయలేకపోతుంది.
రాష్ట్రంలోని పార్టీలలో కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, టీఆర్‌ఎస్ మినహా మిగిలిన పార్టీలన్నీ ఇది దారుణమని బాధపడుతున్నాయి. టీఆర్ఎస్ ఈ తీర్పు విషయంలో పెద్దగా స్పందించలేదు. ఇది పెద్దగా పట్టిచుకోవాల్సిన అంశం కాదని లైట్‌గా తీసుకోవడం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపరుస్తోంది.
ఇక వైఎస్సార్సీపీ అయితే నేరమంతా చంద్రబాబు మీద వేయడానికి ప్రయత్నం చేసింది. చంద్రబాబు హయాంలో ప్రాజెక్టులు కట్టకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిపడిందని చెబుతూ మోకాలికి, బోడిగుండుకి ముడి వేసే ప్రయత్నం చేయడం మరో ఆశ్చర్యకరమని విశ్లేషకులు అంటున్నారు.