పెళ్లి మంటపంలోనే కొత్త జంట డిష్యూం డిష్యూం
posted on Dec 16, 2022 @ 11:00AM
పెళ్లంటే నూరేళ్ల పంట.. అంటారు. కలకాలం కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండాలని పెళ్లిక వచ్చిన వారంతా మనస్ఫూర్తిగా ఆశీర్వదించి అక్షింతలు వేస్తారు. పెళ్లి మంటపం అంతా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. పచ్చటి తోరణాలతో శోభాయమానంగా ఉంటుంది. అయితే ఇటీవలి కాలంలో పెళ్లి పందిట్లో ఘర్షణలు జరుుగతున్న వార్తలు తరచుగా వింటున్నాం. పెళ్లి విందులో చికెన్ వడ్డించలేదన్న గొడవ కారణంగా పెళ్లి ఆగిపోయిన సంగతి ఇటీవలే జరిగింది.
పెళ్లి కొడుకు ముక్కు చిన్నగా ఉందంటూ పీటల మీదే పెళ్లిని పెటాకులు చేసుకున్న పెళ్లి కూతురి4 ఉదంతమూ తెలిసిందే. తాజాగా పెళ్లి పీటల మీదే వధూవరులు కోట్లాటకు దిగి ఒకరిని ఒకరు కట్టుకున్న ఉదంతం ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయ్యింది. ఎక్కడ జరిగింది.. ఎప్పుడు జరిగింది అన్న సంగతి స్పష్టంగా తెలియడం లేదు కానీ ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం నెట్టింట హల్ చల్ చేస్తోంది. పెళ్లి తంతులో భాగంగా వరుడు వధువుకు మిఠాయి తినిపించాలి. అయితే మిఠాయి తినడానికి వధువు నిరాకరించింది.
అదంతా సరదా లేదా సరసం అనుకున్నాడో ఏమో వరుడు ఆమె నోట్లో బలవంతంగా మిఠాయి పెట్టేందుకు ప్రయత్నించాడు. దీంతో వధువు ఒక్క సారిగా భద్రకాళి అవతారం ధరించినట్లుగా రెచ్చిపోయింది. వరుడి చెంప పగుల కొట్టింది. దీంతో వరుడు దిమ్మతిరిగింది. తేరుకున్న వెంటనే నన్నే కొడతావా అంటూ వధువుపై చేయి చేసుకున్నాడు. ఇక అక్కడ నుంచీ వారి మధ్య యుద్ధకాండ మొదలైంది. ఒకరినొకరు కొట్టుకుంటూ రచ్చ చేశారు. పెళ్లికి వచ్చిన బంధువులు వారిని నివారించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పెళ్లి మంటపంలో ఒక్క సారిగా పిన్ డ్రాప్ సైలెన్స్ అలుముకుంది. అయితే ఈ సంఘటన అంతా వీడియో తీసిన వారు మాత్రం వధూవరుల యుద్ధ కాండకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. అదీ అలాంటిలాంటి బ్యాక్ గ్రౌండ్ కాదు బాహుబలి, అఖండ వంటి సినిమాలను మించిపోయే సౌండ్ ఎఫెక్ట్ ఇచ్చారు. పీటల మీద తన్నుకున్న వధూవరులు తరువాత ఏం చేశారో ఏమో కానీ వారి ఫైటింగ్ సీన్ మాత్రం నెట్టింట నవ్వులు పూయించారు.