అపరేషన్ కగార్‌పై ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. ఆపరేషన్ కగార్ స్టాప్.. సరిహద్దులకు భద్రతా దళాలు
posted on May 10, 2025 @ 4:18PM
మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్ కగార్ నిలిచిపోయింది. మావోయిస్టుల ఏరివేతకు తాత్కాలికంగా విరామం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఆపరేషన్ సిందూర్ అనంతర పరిణామాల నేపథ్యంలో ఆపరేషన్ కగార్ లో ఉన్న భద్రతా దళాలను వెనక్కు పిలిపించి, వారిని సరిహద్దుల్లో మోహరించనుంది. ఇందు కోసం ఆపరేషన్ కగార్ ను తాత్కాలికంగా నిలిపివేసింది. పాకిస్థాన్ తో యుద్ధం వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
అపరేషన్ కగార్ లో నిమగ్నమై ఉన్న దాదాపు ఐదు వేల మంది బలగాలను కేంద్రం వెనక్కు రప్పిస్తోంది. ఇందులో భాగంగానే కర్రెగుట్టల్లో విధులు నిర్వహిస్తున్న భద్రతా దళాల ఉపసంహరణ ప్రారంభమైంది. ఇక్కడ నుంచి ఈ బలగాలు రేపటికల్లా సరిహద్దులకు చేరుకోనున్నాయి. కాగా.. వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టులు లేకుండా చేయడమే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ కగార్ దూకుడుగా సాగుతోంది.
ఆపరేషన్ కగార్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో భారీగా మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో పలువురు అగ్రనేతలు కూడా ఉన్నారు. గత కొద్దిరోజులుగా ఆపరేషన్ కర్రెగుట్టలు పేరుతో మావోయిస్టులను ఏరివేసేందుకు భద్రతా బలగాలు కర్రెగుట్టలపై సెర్చ్ కొనసాగిస్తున్నాయి. మావోయిస్టు ఆగ్రనేతలే టార్గెట్‌గా ఆపరేషన్ కర్రెగుట్టల్లో పెద్ద ఎత్తున కూబింగ్ కొనసాగిస్తున్నారు. ఇప్పుడు పాక్ తో యుద్ధం కారణంగా ఈ కూంబింగ్ కు బ్రేక్ పడినట్లైంది.