వీళ్లు మారర్రా.. మారరు!
posted on Nov 2, 2022 6:58AM
ఆకతాయి చేష్టలతో తమ ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవడమే కాకుండా ఇతరుల ప్రాణాలను కూడా రిస్క్ లో పెట్టేస్తుంటారు కొందరు. గుజరాత్ లోని కేబుల్ బ్రిడ్జి కుప్ప కూలిన సంఘటనలో 140 మందికి పైగా దుర్మరణం పాలు కావడానికి కొందరు ఆకతాయిలు బ్రిడ్జిని బలంగా ఊపడమే కారణమని అంటున్న సంగతి తెలిసిందే. ఆ సంఘటన దేశ వ్యాప్తంగా అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ దుర్ఘటన మరువక ముందే.. కర్నాటకలో మళ్లీ అంతటి ప్రమాదం రిపీట్ అయ్యే పనికి పూనుకున్నారు కొందరు ఆకతాయిలు.
కర్నాటకలోని ఓ కేబుల్ బ్రిడ్జిపైకి కొందరు ఆకతాయిలు ఏకంగా కారు ఎక్కించేశారు. స్థానికులు అభ్యంతరం పెట్టినా లెక్క చేయలేదు. కేబుల్ బ్రిడ్జిపైకి కారు తీసుకురావడం కూడదనీ, ఆ బరువుకు బ్రిడ్జి కూలిపోయే ప్రమాదం ఉందని వారించిన స్థానికులతో వాగ్వాదానికి దిగారు. బ్రిడ్జిపై కారులో కొద్ది దూరం షికారు చేశారు.
అదృష్టం బాగుండి ఎటువంటి ప్రమాదం జరగలేదు కానీ.. వారు బ్రిడ్జిపై కారు తీసుకువచ్చి స్థానికుల అభ్యంతరంతో వెనక్కు వెళ్లే వరకూ అంతా ప్రాణాలుగ్గబెట్టుకుని ఉన్నారు. కర్నాటకలోని యెల్లాపూర్ లోని శివపుర కేబుల్ బ్రిడ్జిపై జరిగింది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిబంధనలను తుంగలోకి తొక్కి కేబుల్ బ్రిడ్జిపైకి కారును తీసుకువచ్చిన వారిప కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.