బీజేపీలో నన్నెందుకు చేర్చుకొంటారు? బొత్స

 

చాలా మంది రాజకీయ నాయకులు మీడియా వాళ్ళు అడిగే కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పలేక తడబడుతుంటారు. అటువంటి వారు మాజీ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ స్టేట్మెంటులను జాగ్రత్తగా గమనిస్తుంటే ఇబ్బందికర పరిస్తితులలో ఏవిధంగా లౌక్యంగా జవాబు చెప్పవచ్చో తెలుసుకోవచ్చును. ఎన్నికలలో తను, తన పార్టీ ఓడిపోయినప్పటి నుండి పార్టీకి దూరంగా ఉంటున్న ఆయన, బీజేపీలో చేరబోతున్నట్లు మీడియాలో అనేక వార్తలు వస్తున్నప్పటికీ ఏనాడు వాటిని నిర్ద్వందంగా ఖంచలేదు. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి, ఆయన ఓడిపోయుంటే తప్పకుండా ఖండించేవారేమో? వచ్చేనెల బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ వచ్చినప్పుడు బొత్స సత్యనారాయణతో సహా అనేకమంది బీజేపీలో చేరబోతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

 

మళ్ళీ చాలా రోజుల తరువాత ఈరోజు ఆయన మీడియాకు ఎదురుపడ్డప్పుడు ముందుగా ఆయన ఎదుర్కొన్న ప్రశ్న అదే. అయితే దానికి ఆయన ఏ మాత్రం తడబడకుండా బీజేపీలో చేరుతున్నాను అని కానీ లేదా అటువంటి ఆలోచనలో ఉన్నానని గానీ లేదనిగానీ చెప్పకుండా “ఎన్నికలలో ఓడిపోయిన నా వంటి వారిని బీజేపీ ఎందుకు చేర్చుకొంటుంది?” అని గడుసుగా ఎదురు ప్రశ్నించారు. పైగా “ఇంతవరకు ఆ పార్టీనేతలెవరూ నన్ను సంప్రదించలేదని” చెప్పడం గమనిస్తే, తనకు ఆ పార్టీలో చేరేందుకు ఆసక్తి ఉన్నప్పటికీ వారే చొరవ చూపలేదన్నట్లుంది. అయితే ఈ మధ్యనే బీజేపీ నేత సోము వీర్రాజు ఆయనను కలిసినట్లు దృవీకరించారు. సమర్దులయిన కాంగ్రెస్ నేతలెవరయినా తమ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపితే వారిని సాధరంగా పార్టీలోకి ఆహ్వానిస్తామని కూడా చెప్పారు.

 

బొత్స సత్యనారాయణతో సహా చాలా మంది కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరే విషయాన్నీచివరి నిమిషం వరకు చాలా రహస్యంగా ఉంచుతున్నారు. ఎందుకంటే తెదేపా లేదా స్థానిక బీజేపీ నేతలు వారు పార్టీలో చేరకుండా అడ్డుపడతారనే భయం కావచ్చును లేదా మరేదయినా కారణం కావచ్చును.

 

ఆయన చాలా కాలంగా సోనియా, రాహుల్ గాంధీల భజన చేయడం కూడా పూర్తిగా మానేశారు. బీజేపీలో చేరే ఉద్దేశ్యం ఉన్నప్పుడు యధావిధిగా సోనియా, రాహుల్ గాంధీల భజన చేస్తుంటే పార్టీలోకి ఎంట్రీ దొరకడం కష్టమని ఎవరయినా చెప్పగలరు. బహుశః బీజేపీలో చేరే ఉద్దేశ్యంతోనే ఆయన తన భజన కార్యక్రమాన్ని పూర్తిగా మానుకొని ఉండవచ్చును. ఏమయినప్పటికీ వచ్చే నెల ఏడెనిమిది తేదీల వరకే ఈ సస్పెన్స్ కొనసాగించవచ్చును. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ వచ్చినప్పుడు ఎవరెవరు బీజేపీ కండువాలు కప్పుకొంటారో అంతా తేటతెల్లం అయిపోతుంది.

Teluguone gnews banner