మీడియా వేదికగా కాంగ్రెస్ నేతల యుద్ధం
posted on May 4, 2013 @ 1:09PM
రోజుకో పధకంతో ప్రజలలోకి దూసుకుపోతున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఒంటెత్తు పోకడలను వ్యతిరేఖిస్తున్నమంత్రులు దామోదర రాజనరసింహ, జానారెడ్డి, డీయల్.రవీంద్ర రెడ్డి, వట్టి వసంత కుమార్ తదితరులు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నేతృత్వంలో నిన్నఆయన ఇంట్లోనే సమావేశం అయి, ముఖ్యమంత్రి తమ పట్ల అనుసరిస్తున్న అనుచిత, నిర్లక్ష్య వైఖరిని వివరిస్తూ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ గులాం నబీ ఆజాద్ కి లేఖ వ్రాసినట్లు పత్రికలలో వార్తలు వచ్చాయి. కానీ, అటువంటిదేమి లేదని బొత్స సత్యనారాయణ ఖండించినప్పటికీ, రాష్ట్ర వ్యవహారాల గురించి నివేదికలు పంపడం మామూలేనని చెప్పడం పత్రికలలో వచ్చిన వార్తలు నిజమేనని అర్ధం అవుతుంది.
దీనికి విరుగుడుగా త్వరలో ముఖ్యమంత్రి డిల్లీకి వెళ్లి పార్టీ అధిష్టానంతో మాట్లాడనున్నారని మరో వార్తా పత్రికలకి లీకయింది. కానీ, మళ్ళీ కొద్ది సేపటికే ముఖ్యమంత్రికి డిల్లీ పర్యటన ఆలోచన ఏమిలేదని, మీడియాలో వస్తున్నవార్తలు నిజం కాదని ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఒక ఖండన ప్రకటన వెలువడింది. ముఖ్యమంత్రి పర్యటన గురించి ఆయన కానీ, ఆయన కార్యాలయ సిబ్బంది గానీ ఎవరూ ప్రకటించకపోయినా, ఆయన డిల్లీ బయలుదేరుతున్నట్లు మీడియాలో వార్తలు రావడం రాజకీయ ఎత్తుగడ అయిఉండవచ్చును. బహుశః అసమతి నేతలని కట్టడి చేయడానికే ముఖ్యమంత్రి అనుకూల వర్గానికి చెందినవారెవరో ఇటువంటి వార్తని మీడియాకి లీక్ చేసి ఉండవచ్చును. లేదా నిజంగానే ఇది మీడియా సృష్టి అయిఉండవచ్చును కూడా. కానీ, ఈ వార్త ప్రభుత్వంలో ముఖ్యమంత్రికి, ఆయనని వ్యతిరేఖించేవారికి మద్య జరుగుతున్నకుమ్ములాటలకి అద్దం పట్టింది.