సరదాగా.. బొత్స బాబుకు కొట్టాల్సిందే చప్పట్లు...
posted on Dec 29, 2021 9:15AM
బొత్స సత్యనారాయణ ఉరఫ్ సత్తి బాబు తెలుసు కదా.. తెలియకుండా ఎందుకుంటారు.. ఆయన పరిచయం అవసంరం లేని పొలిటీషియన్. అంతేకాదు, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రి. అదికూడా అలాంటి .. ఇలాంటి మంత్రి కాదు... సీనియర్ మినిస్టర్. అంతోటి అయన నోటినుంచి ఏదైనా మాట వచ్చిందంటే, అందులో ఎన్నో అర్థాలు, తాత్పర్యాలు ఉంటాయి.
అప్పుడెప్పుడో, ఆయన గారు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ కాబినెట్’లో మంత్రిగా ఉన్న రోజులల్లో వోక్సువాగను కార్ల కంపెనీ పట్టుకొస్తామంటే ఓ రూ.11 కోట్లు ప్రజల సొమ్ము వశిష్ట వాహన్ అనే అడ్రసులేని కంపెనీ కిచ్చేశారు. తీరామోసి ఆ సూట్ కేసు కంపెనీ, ఆ సొమ్ములట్టుకుని ఎగిరి పోయింది. అప్పుడు, మన బొత్స బాబు ఏమ్మన్నారు, చాలా సింపుల్’గా, సొమ్ములు పోనాయి అయితే ఏంటంట..అని అసెంబ్లీ సాక్షిగా సెలవీయ లేదు. శ్రీ బొత్స బాబు ఇచ్చిన ఆ సందేశంలో ఎంత విషయముంది.. ఎంత ఇది .. ఎంత అది ఉంది, అందుకే కదా ఇన్నేళ్ళ తర్వాత కూడా ‘సొమ్ములు పోనాయండి’ అన్న శ్రీ బోత్సవారి సందేశం, డామిట్ కథ అడ్డంతిరిగింది న్న గిరీశం డైలాగులా మనకు గుర్తుండి పోయింది.
ఆ కథను అక్కడ కట్ చేసి ... ప్రెజంట్ ... ప్రస్తుతంలోకి వస్తే, బొత్స వారు మళ్ళీ ఇంతకాలానికి అంతటి ఆణిముత్యం లాంటి మాట ఒకటి వదిలారు .. మూడేళ్ల తర్వాత ఇప్పుడు జగన్ పరిపాలన బాగోలేదని గుర్తొచ్చిందా? అని బీజేపీ వాళ్ళను సూటిగా, చాలా స్ట్రెయిట్’ గా ప్రశ్నించారు. నిజమే కదా.. జగన్మోహన్ రెడ్డి పాలన కొత్తగా ఈరోజు చెడిపోయింది ఏముంది? ప్రమాణ స్వీకారం చేసిన తొలి క్షణం నుంచే జగన్ రెడ్డి తానేమిటో .. తన ఒక్క ఛాన్స్ కథేమిటో .. ఎక్కడా ...ఏమాత్రం దాచుకోకుండా, దాపరికం లేకుండా చెపుతూనే ఉన్నారు. చూపిస్తూనే ఉన్నారు. అధికారంలోకి వస్తూ వస్తూనే ప్రజా వేదికను కూల్చేశారు. ఇక అక్కడి నుంచి అన్నీ కూల్చివేతలే. భవనాలే కాదు వ్యవస్థలను కూల్చి వేస్తూనే ఉన్నారు. వ్యవస్థలనే కాదు .. దేవుళ్ళను .. దేవాలయాలను ... గుళ్ళూ గోపురాలను కూల్చి వేస్తునే ఉన్నారు.ఆర్థిక వ్యవస్థ విషయం అయితే చెప్పనే అక్కరలేదు .. రాష్ట్రానికి రాజధాని లేదు కానీ, రాష్ట్ర అప్పులు నాలుగు నుంచి ఆరులక్షల కోట్ల రూపాయల వరకు ఉంటాయని అంటున్నారు. ఇవ్వన్నీ కూడా బహిరంగ రహస్యాలే.
కేంద్ర ప్రభుత్వం ఎప్పుడోనే కళ్ళు తెరవవలసింది. ఎందుకైతే ఏం గానీ కల్లు తెరవలేదు. అందుకే .. ఇప్పుడు శ్రీ సత్తిబాబు గుర్తు చేశారు. జగన్ పాలన, ఇప్పుడేమిటి, మూడేళ్ళుగా ఇలాగే ఇలాగే, ఇంతే సుందర ముదనష్టంగానే సాగింది. అవును మూడేళ్ళుగా బాగాలేదండి .. ఏటి సేత్తాం .. అని ... చక్కగా ఉత్తరాద్ర యాసలో అడిగారు.అంతే కాదు ఏదైనా తప్పుటే సెప్పండని కూడా ఆఫర్ ఇచ్చారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి జగన్ రెడ్డి అరాచక పాలన చూడమని కేంద్ర ప్రభుత్వానికి చెప్పకనే చెప్పారు. ఇంత చక్కని నిజాన్ని చక్కగా చెప్పిన బొత్స బాబుకు కొట్టాల్సిందే ...చప్పట్లు. ఏమంటారు.