లాక్ డౌన్ పొడగింపు మీద బోస్టన్ నివేదిక..
posted on Apr 10, 2020 @ 6:31PM
లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారు అనే విషయంలో గుంభనంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం జూన్ వరకు లాక్ డౌన్ పొడిగించే ఉద్దేశంతో ఉందా.. ప్రపంచ ప్రసిద్ధ బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ తాజా నివేదిక ప్రకారం ఈవిషయం నిజమేననిపిస్తోంది. దేశంలో లాక్‌డౌన్‌ను జూన్ నాలుగో వారం వరకు కొనసాగించే అవకాశం ఉంది. అప్పటికీ పరిస్థితి మెరుగుపడకపోతే సెప్టెంబర్ వరకు కొనసాగినా అశ్చర్యపోవాల్సిన పనిలేదు అని బీసీజీ నివేదికలో తెలుపడం సంచలనం కలిగిస్తోంది.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భారత్‌లో 21 రోజుల పాటు విధించిన లాక్‌డౌన్ ఎప్పుడు ఎత్తివేస్తారనే చర్చ ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున సాగుతోంది. ఏప్రిల్ 15న లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన సంకేతాలు మాత్రం రావడంలేదు. లాక్‌డౌన్‌ను మరికొన్ని నెలల పాటు పొడిగిస్తారని సామాజిక మాధ్యమాల్లో జోరుగా జరుగుతున్న ప్రచారానికి తగ్గట్టుగానే కేంద్రం కొన్ని సంకేతాలు ఇస్తోంది. మరో వైపు కేంద్రం నిర్ణయంతో సంభందం లేకుండా ఒడిశా, పంజాబ్ వంటి కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ పోదిగించాయి. అయితే ప్రస్తుతం దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు, మరోవైపు కోవిడ్ మృతుల సంఖ్య ప్రజల్లో భయాందోళనలను సృష్టిస్తోంది.
ఈ క్రమంలో ఏప్రిల్ 15న లాక్‌డౌన్ ఎత్తివేసే సాహసం కేంద్ర ప్రభుత్వం చేస్తుందా.. అనేది కోట్లాది మందిని వెంటాడుతున్న ప్రశ్న. ఈ నేపథ్యంలోనే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రఖ్యాత బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) భారత్‌లో లాక్‌డౌన్, ప్రస్తుత పరిస్థితులపై ఓ రిపోర్టును వెలువరించింది. బీసీజీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన రిపోర్టు భారత్‌ను మరింత వణికిస్తోంది. ఈ అత్యంత తాజా రిపోర్టులో బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఏమని చెప్పిందంటే..
‘దేశంలో లాక్‌డౌన్‌ను జూన్ నాలుగో వారం వరకు కొనసాగించే అవకాశం ఉంది. అప్పటికీ పరిస్థితి మెరుగుపడకపోతే సెప్టెంబర్ వరకు కొనసాగినా అశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎందుకంటే లాక్‌డౌన్‌ను ప్రకటించడం కన్నా.. దానిని ఎత్తివేయడం చాలా కష్టతరమైన విషయం. అత్యధిక జనాభా కలిగిన భారత్‌లో ఇది మరింత కఠినం. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య పెద్ద ఎత్తున పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా ఏప్రిల్ 15న లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తారని అనుకోవడం లేదు. లాక్‌డౌన్‌ను ఎత్తివేసిన తరువాత వైరస్‌ను అదుపుచేయడం భారత్ వైద్యులకు అంత సులువైనది కాదు. వైరస్ వ్యాప్తి తగ్గకముందే లాక్‌డౌన్ ఎత్తివేస్తే ఇబ్బందులు తప్పవు’ అని బీసీజీ తన నివేదికలో పేర్కొంది.
ఈ నేపథ్యంలో బీసీజీ నివేదికపై దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై పలువురు ప్రముఖులు వివిధ కోణాల్లో స్పందిస్తున్నారు. లాక్‌డౌన్‌ను పొడిస్తారని కొందరు అభిప్రాయపడుతుండా... ప్రాంతాలు, వైరస్ ప్రభావాన్ని బట్టి దీనిపై కేంద్ర నిర్ణయం తీసుకుంటుందని పలువురు విశ్లేషిస్తున్నారు. కాగా దేశంలో వైరస్ తొలిదశలో ఉన్న సమయంలోనే మార్చి 24న దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధించిన విషయం తెలిసిందే. ఇక దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6412కి చేరింది. ఇప్పటివరకు కరోనాతో 199 మంది మృతి చెందారు. ఇతరదేశాలతో పోలిస్తే భారత్‌లో కోవిడ్ 19 వైరస్ ముసలివారికి కాకుండా యువతకు సోకుతుండటం మరింత భీతి కలిగిస్తోంది.