ఎంపీ నవనీత్ కౌర్ ఎస్సీ సర్టిఫికేట్ రద్దు! బాంబే హైకోర్టు సంచలనం
posted on Jun 8, 2021 @ 3:20PM
మహరాష్ట్రలోని అమరావతి లోక్ సభ సభ్యురాలు, సినీ నటి నవనీత్ కౌర్ (35) కు ఊహించని షాక్ తగిలింది. ఆమె ఎస్సీ కాదంటూ బాంబే హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నవనీత్ కౌర్ ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాన్ని బాంబే హైకోర్టు రద్దు చేసింది. ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం రద్దుతో పాటు రూ.2 లక్షల జరిమానా కూడా విధించింది న్యాయస్థానం. ఆరు వారాల్లోగా అన్ని ధ్రువపత్రాలను సమర్పించాలని ఆదేశించింది. కుల ధ్రువీకరణ రద్దు నేపథ్యంలో నవనీత్ కౌర్ తన ఎంపీ పదవిని కోల్పోయే ప్రమాదంలో పడ్డారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో నవనీత్ కౌర్ అమరావతి ఎస్సీ రిజర్వ్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. అయితే, నవనీత్ కౌర్ తాను ఎస్సీ అని పేర్కొంటూ తప్పుడు పత్రాలు సమర్పించారని శివసేన నేత ఆనంద్ రావ్ అడ్సల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై బాంబే హైకోర్టు విచారణ జరిపింది. ఆమె ఎస్సీ కాదని తేల్చింది.
గత మార్చిలో శివసేన ఎంపీ అరవింద్ సావంత్ తనను లోక్ సభ లాబీలో బెదిరించారని నవనీత్ కౌర్ ఆరోపించడం కలకలం రేపింది. మహారాష్ట్ర సర్కారుకు వ్యతిరేకంగా పార్లమెంటులో మాట్లాడితే జైలుకు పంపిస్తామని హెచ్చరించారని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాదు, శివసేన లెటర్ హెడ్ తో బెదిరింపు లేఖలు వస్తున్నాయని, హెచ్చరికలు చేస్తూ ఫోన్ కాల్స్ వస్తున్నాయని నవనీత్ కౌర్ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు కూడా ఫిర్యాదు చేశారు. తనపై యాసిడ్ దాడి చేస్తామని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో ఆమె ఆరోపించారు.
2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో నవనీత్ కౌర్ సమర్పించిన కుల ధ్రువీకరణ పత్రాన్ని కూడా గతంలో హైకోర్టు రద్దు చేసింది. అయితే ఈ ఎన్నికల్లో ఆమె పరాజయం పాలయ్యారు. నవనీత్ కౌర్ 1986 జనవరి 3న ముంబైలో జన్మించారు. ఆమె తెలుగు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఆమె తల్లిదండ్రులు పంజాబ్‌కు చెందినవారు. నవనీత్ కౌర్ తెలుగు సహా ఏడు భాషలు మాట్లాడగలరు.