బాలీవుడ్ తారలకు చెడ్డరోజులు
posted on Mar 24, 2013 @ 3:23PM
బాలీవుడ్ తారలకు మళ్ళీ చెడ్డరోజులు మొదలయినట్లు ఉంది. మొన్న సుప్రీం కోర్టు 1993 లో జరిగిన ముంబై ఉగ్రవాదుల దాడుల కేసులో ప్రముఖ బాలివుడ్ నటుడు సంజయ్ దత్త్ కు 5 సం.లు జైలు శిక్ష విదిస్తూ తీర్పునీయగా, మళ్ళీ నిన్న రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ కోర్టు బాలీవుడ్ తారలు సల్మాన్‌ఖాన్, సైఫ్ అలీఖాన్, సోనాలీ బింద్రే, టబు, నీలమ్‌లకు వ్యతిరేఖంగా నేరాభియోగాలు నమోదుచేసింది.
ఈ ఐదుగురు 1998లో ‘హమ్‌సాథ్ సాథ్ హై’ అనే హిందీ సినిమా షూటింగ్ కోసం వారు రాజస్థాన్ జోధ్పూర్ వెళ్ళినప్పుడు షూటింగ్ విరామం రోజున సమీప గ్రామంలో అడవి జింకలను వేటాడినట్లు వారిపై గ్రామస్తులు పోలీసులకు పిర్యాదుచేయడంతో వారిపై కేసు నమోదు అయింది. నాటి నుండి నేటి వరకు సాగుతూ వస్తున్నఆ కేసు నిన్నమళ్ళీ కోర్టు ముందు వచ్చింది. శనివారంనాడు కోర్టులో వారిపై నేరాభియోగాలు నమోదుచేయబడ్డాయి. అయితే తాము నిర్దోషులమని వారు వాదించినట్లు సమాచారం.
ఈ కేసులో మొదటి ముద్దాయిగా పేర్కొనబడుతున్న బాలివుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం లండన్ ఆసుపత్రిలో చేరి వైద్యం చేయించుకొంటున్నందున ఆయన తప్ప మిగిలిన వారందరూ నిన్న కోర్టుకు హాజరయ్యారు. కోర్టు తదుపరి విచారణను వచ్చేనెల 27కు వాయిదా వేసింది. వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని 51, 9/51, 9/52 సెక్షన్ల కింద నమోదయిన అభియోగాలు కానీ నిరూపించబడితే వారిలో ఒక్కొకరికీ కనీశం 6సం.లు జైలు శిక్షపడే అవకాశం ఉంటుంది. అదే జరిగితే బాలివుడ్ కి ఏది మరో పెద్ద ఎదురుదెబ్బవుతుంది.
సంజయ్ దత్త్ కు క్షమాబిక్ష ప్రసాదించమని ఇప్పటికే చాలా మంది ప్రముఖులు మహారాష్ట్ర ప్రభుత్వానికి మరియు మహారాష్ట్ర గవర్నరుకూ విజ్ఞప్తులు చేస్తున్నారు. అందుకు ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించడం బాలివుడ్ కు కొంత ఊరట కలిగిస్తున్నది. సినిమాలలో సమాజాన్ని, దేశాన్ని రక్షించేసే మన హీరోలు నిజ జీవితంలో మాత్రం తద్విరుద్దంగా ప్రవర్తించడం తమ సినిమా భ్రమలోంచి బయటపడకపోవడం వలననే జరుగుతోందని చెప్పవచ్చును. సినిమాలలో చెల్లినట్లే నిజ జీవితంలో తమ ఆటలు చెల్లవని ఇటువంటి తీర్పులు వారికి గుణ పాఠాలు నేర్పిస్తున్నాయి.