ఆ బోట్లపై అనుమానాలెందుకంటే..?
posted on Sep 10, 2024 @ 10:23AM
కృష్ణమ్మ వరద పోటెత్తి ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రమాదకరంగా ప్రవహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా ఐదు బోట్లు కొట్టుకు వచ్చి బ్యారేజీ గేట్లు ఢీకొన్న సంఘటనను తేలిగ్గా తీసుకోరాదనీ, ఆ బొటు యజమానులను తక్షణమే అరెస్టు చేసి విచారించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. అనవసరంగా విచారణ పేరిట కాలయాపన చేయకుండా బోటు యజమానులపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య సైతం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అసలు భారీ వరద సమయంలో బోట్లు కొట్టుకు వచ్చి ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీ కొనడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. మంత్రి నిమ్మల రామానాయుడు అయితే ఆ సంఘటన ప్రమాదవశాత్తూ జరిగింది కాదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. అసలు ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొన్న ఘటనపై అనుమానాలు రేకెత్తడానికి ప్రధాన కారణం ఆ సంఘటన జరిగిన సమయంలో అక్కడ అసాధారణ పరిస్థితులు ఉండటమే. ఏమిటా అసాధారణ పరిస్థితులు అంటే వరదలో కొట్టుకు వచ్చి ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొన్న ఐదు బోట్లలో మూడు ఒకదానికి ఒకటి కట్టేసి ఉన్నాయి. ఈ విధంగా బోట్లను కట్టేయడం జరగదు. ఎందుకంటే వరదల సమయంలో ఏ బోటుకు ఆబోటును వేర్వేరుగానే లంగరు వేస్తారు. ఒక వేళ కొట్టుకుపోతే ఒక బోటు కొట్టుకుపోతుంది. మిగిలినవైనా మిగులుతాయి. ఇలా కట్టివేయడం వల్ల ఒకబోటు కొట్టుకుపోతే మిగిలిన బోట్లు కూడా దానితో పాటే కొట్టుకుపోతాయి. ఇలా అసాధారణంగా మూడు బోట్లను ఒకదానికి ఒకటి కట్టివేయడంతో మూడూ కలిసి కొట్టుకుపోయి ప్రకాశం బ్యారేజీ గేట్లకు నష్టం చేకూర్చాయి.
ఇక బోట్ల విషయంలో అనుమానాలు బలంగా వ్యక్తం కావడానికి మరో కారణమేంటంటే.. ఆ బోట్లను బల హీనమై ప్లాస్టిక్ తాడుతో లంగర్ వేయడం. సాధారణంగా వరదల సమయంలో అలాంటి బలమైన ప్లాస్టిక్ తాడుతో బోట్లను ఎవరూ కట్టేయరు. అంతే కాకుండా భారీ వరదకు సంబంధించి స్థానికంగా జారీ చేసిన హెచ్చరికలను కూడా బోటు యజమానులు పట్టించుకోకపోవడాన్ని బట్టి చూస్తే కావాలనే వాటిని ప్రవాహంలో కొట్టుకుపోయి బ్యారేజీ గేట్లను ఢీకొట్టాలన్న కుట్ర ఉందని అనిపించక మానదు. వాస్తవానికి ఆ బోట్లను గొల్లప్రోలు గ్రేవ్ యార్డ్ వద్ద కట్టేశారు.దీంతో అవి ప్రవాహానికి కొట్టుకుపోయి ప్రకాశం బ్యారేజీ గేట్లను బలంగా ఢీకొన్నాయి. ఆ బోట్ల యజమానులకు వైసీపీతో దగ్గర సంబంధాలు ఉండటం, ఆ బోట్లకు వైసీపీ రంగులు వేసి ఉండటం చూస్తుంటే వైసీపీ నేతలు లేదా వారి అనుచరులకు ఈ ఘటనతో ప్రమేయం ఉందని భావించాల్సి వస్తున్నది.
ప్రజా భద్రతకు, బ్యారేజీకి నష్ఠం వాటిల్లే విధంగా జరిగిన ఈ సంఘటనపై ఇప్పటికే పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలోనే బోటు యజమానులను వెంటనే అరెస్టు చేసి విచారించాలన్న డిమాండ్ జోరందుకుంది. ఒక పక్క బుడమేరు ముంపు, మరో పక్క కృష్ణానదిలో గతంలో ఎన్నడూ లేని విధంగా 12 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం, ఇంకో పక్క భారీ వర్షంతో బెజవాడ గజగజా వణుకుతుంటే.. ఎలాంటి భద్రతా లేకుండా, అత్యంత నిర్లక్ష్యంగా బోట్లను నదిలో ఉంచిన బోటు యజమానుల నిర్లక్ష్యాన్ని ఎంత మాత్రం ఉపేక్షించరాదని అంటున్నారు. అంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారికి శిక్ష పడాల్సిందేనంటున్నారు. అలా కాకుండా ఈ ఘటన వెనుక నిర్లక్ష్యం కాకుండా కుట్ర ఉంటే వాళ్లను ఉరి తీసినా పాపంలేదంటున్నారు. ఆ బోట్ల ధాటికి బ్యారేజీ గేట్ల కౌంటర్ వెయిట్లు మాత్రమే దెబ్బతిన్నాయి కనుక సరిపోయింది కానీ, అదే బ్యారేజీ దిమ్మలు ధ్వంసమై ఉంటే ఎంత ప్రమాదం జరిగేదన్నది ఊహకే అందనంత భయంకరంగా ఉండేదని అంటున్నారు.