బ్లాక్ ఫంగస్.. కరోనా కంటే డేంజర్.. తెలుగు స్టేట్స్ అలర్ట్..
posted on May 16, 2021 @ 1:19PM
బ్లాక్ ఫంగస్. పది రోజులుగా మారుమోగుతున్న పేరు. కరోనా కంటే ఇప్పుడిదే యమ డేంజర్‌గా కనిపిస్తోంది. కరోనా సోకినా.. ఎలాగోలా బతికి బయటపడొచ్చేమో కానీ.. బ్లాక్ ఫంగస్ అటాక్ చేస్తే.. ఇక అంతే. కరోనా కంటే వేగంగా ప్రాణాలు తీస్తోంది. లక్షణాలు కనిపించగానే.. వెంటనే ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేయకపోతే.. గంటల వ్యవధిలోనే రోగిని కబలించి వేస్తోంది.
బ్లాక్ ఫంగస్ ఎవరికి, ఎలా, ఎందుకు సోకుతుంది?
కరోనా వచ్చి తగ్గిపోయిన వారిపైనే బ్లాక్ ఫంగస్ ప్రభావం కనిపిస్తోంది. కొవిడ్ చికిత్సలో స్టెరాయిడ్స్ వాడిన వారు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు.. డయాబెటిస్ పేషెంట్టు.. ICUలో ఎక్కువ కాలం ఉండే వారు.. బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నారు. ఆక్సిజన్ అందించేప్పుడు స్టెరైల్ నీటికి బదులు తేమ అందించే పరికరం ద్వారా అందించడం బ్లాక్ ఫంగస్‌కు కారణమవుతోందని నిపుణులు చెబుతున్నారు. హ్యుమిడిఫయర్లేలో స్టెరైల్ నీటినే ఉపయోగించాలి. కానీ, ప్రైవేటు ఆసుపత్రులు, కొవిడ్ ఐసోలేషన్ కేంద్రాలు, ఇళ్లలో ఉండి చికిత్స పొందుతున్నవారు సాధారణ నీటినే వాడుతుండటం బ్లాక్ ఫంగస్ వ్యాప్తికి కారణం.
బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఏంటి?
కళ్లు ఎర్రబారటం, ముక్కు చుట్టూ ఎర్రగా అవ్వడం లేదా నొప్పి రావడం, జ్వరం, తలనొప్పి, దగ్గు, ఊపిరి సరిగా ఆడకపోవడం, రక్తపు వాంతులు, మానసిక సమస్యలు వంటి లక్షణాలు ఉంటే.. నాలికపై నల్లటి మచ్చలు ఏర్పడితే.. అది బ్లాక్ ఫంగస్ కావొచ్చు. వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి. ఆలస్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం రావొచ్చు. ఇది పాత ఇన్ఫెక్షనే అయినప్పటికీ.. ప్రస్తుత కొవిడ్ కాలంలో మళ్లీ కొత్తగా విజృంభిస్తోంది. అంటువ్యాధి కాకపోయినా.. ఇది వచ్చిన వారికి 24 గంటల్లో ట్రీట్‌మెంట్ అందించకపోతే.. పరిస్థితి చేజారిపోతోంది.
ఇండియాలో బ్లాక్ ఫంగస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 500లపైనే ఈ కేసులు ఉన్నాయి. దీంతో అన్ని రాష్ట్రాలూ అప్రమత్తం అవుతున్నాయి. మొదట్లో ఉత్తరాది రాష్ట్రాల్లోనే బ్లాక్ ఫంగస్ కేసులు కనిపించగా.. తాజాగా, తెలుగు రాష్ట్రాల్లోనూ దీని ఆనవాళ్లు మొదలవడంతో ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి.
ఏపీని బ్లాక్ పంగస్ భయపెడుతోంది. బ్లాక్ ఫంగస్ కారణంగా పలువురు మరణించండం కలకలం రేపుతోంది. గుంటూరుకు చెందిన 30 ఏళ్ల యువకుడు, కర్నూలుకు చెందిన 60 ఏళ్ల వృద్ధుడు.. కొవిడ్ చికిత్స తీసుకొని కోలుకున్నారు. ఆ తర్వాత వారిలో బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించడంతో మళ్లీ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ.. ఆ యువకుడు, వృద్ధుడు మృతి చెందినట్టు సమాచారం.
శ్రీకాకుళం జిల్లాలోనూ ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ బ్లాక్ ఫంగస్ బారిన పడినట్టు తెలుస్తోంది.
నరసన్నపేట మండలం దాసరివానిపేట గ్రామానికి రామకృష్ణకు ఏప్రిల్ 3న కొవిడ్ నిర్దారణ అయ్యింది. ఆ వెంటనే ఆయనకు శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలో వారం రోజులు చికిత్స చేస్తే కోలుకున్నారు. గత నెల 14న డిశ్చార్జ్ అయ్యారు. తరువాత కొద్ది రోజులకు బ్లాక్ ఫంగస్ సోకినట్లు గుర్తించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాడు.
అటు.. బ్లాక్ ఫంగస్‌పై తెలంగాణ సర్కారు అప్రమత్తమైంది. తెలంగాణలో బ్లాక్ ఫంగస్ కేసులు చికిత్సకు రాష్ట్ర ప్రభుత్వం నోడల్ కేంద్రం ఏర్పాటు చేసింది. కోఠిలోని ఈఎన్‌టీ ఆస్పత్రిని బ్లాక్ ఫంగస్ కేసుల నోడల్ కేంద్రంగా అధికారులు ప్రకటించారు. బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్న వారిలో ఈఎన్‌టీ సమస్యలు వస్తున్నాయని తెలిపింది. బ్లాక్ ఫంగస్ నిర్ధారణ అయిన కరోనా బాధితులకు గాంధీలో చికిత్స అందించనున్నట్టు తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న బ్లాక్ ఫంగస్ బాధితులకు కోఠిలోని ఈఎన్‌టీలో చికిత్స అందిస్తామని చెప్పింది.
బ్లాక్ ఫంగస్ కరోనా కంటే వేగంగా, మరింత ప్రమాదకరంగా మారడంతో.. ఏమాత్రం అనుమానం ఉన్నా, బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించినా.. వెంటనే హాస్పిటల్‌లో చేరడం అత్యవసరం అని వైద్యులు సూచిస్తున్నారు.