మునుగోడులో కమలానికి మూడో ప్లేసే..!
posted on Aug 24, 2022 @ 10:35AM
బీజేపీ ఎంత ప్రయత్నించినా, ఎన్ని గిమ్మిక్కులు చేసినా మునుగోడులో గెలిచే పరిస్థితి లేదని తాజా సర్వే తేల్చేసింది. గెలవడం అటుంచి ఆ పార్టీ మూడో స్థానంతోనే సరిపెట్టుకోవలసి ఉంటుందని కూడా పేర్కొంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా అనంతరం మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ కంచుకోటలాంటి మునుగోడులో జెండా పాతాలని బీజేపీ విశ్వ ప్రయత్నం చేస్తున్నది. కోమటిరెడ్డిరాజగోపాల్ రెడ్డితో పాటు ఇంకా పలువురు కాంగ్రెస్ నుంచి కమలం గూటికి చేరుతారని ఆ పార్టీ ఆశించింది. కానీ అది జరగలేదు. పైపెచ్చు కాంగ్రెస్ బలం మునుగోడులో రాజగోపాలరెడ్డి రాజీనామా తరువాత కూడా తగ్గలేదని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ మునుగోడు పరిస్థితిపై ఒక రహస్య సర్వే చేయించినట్లు సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సంబంధం లేకుండా అధిష్ఠానమే ఈ సర్వే చేయించిందని కాంగ్రెస్ వర్గాలే చెబుతున్నాయి. ఆ సర్వే ఫలితాన్ని ఇటీవల ప్రియాంకా గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశమైన సందర్భంగా వెల్లడించినట్లు చెబుతున్నారు. ఆ సర్వే ప్రకారం మునుగోడులో బీజేపీ చేస్తున్న హడావుడి అంతా పైపై ఆర్భాటమేనని తేలిపోయిందని చెబుతున్నారు. అయితే అంత మాత్రాన కాంగ్రెస్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యే పరిస్థితి కూడా లేదని సర్వే తేల్చిందని అంటున్నారు. ఆ సర్వే ప్రకారం మునుగోడులో బీజేపీ మూడో స్థానంతోనే సరిపెట్టుకోవలసి వచ్చినా కాంగ్రెస్ కు కలిసి వచ్చేదేం లేదనీ, ఆ పార్టీ రెండో స్థానానికి పరిమితమౌతుందని సర్వే ఫలితం వెల్లడించిందని పార్టీ శ్రేణులే అంటున్నాయి.
మునుగోడులో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆ స్థానంలో అధికార టీఆర్ఎస్ విజయం సాధిస్తుందన్నది కాంగ్రెస్ నిర్వహించిన సర్వేలో వెల్లడైనట్లు తెలిసింది. అయితే టీఆర్ఎస్- కాంగ్రెస్ ల మధ్య తేడా చాలా స్వల్పమని, కొంచం గట్టిగా ప్రయత్నిస్తే కాంగ్రెస్ ఈ సీటు నిలబెట్టుకునే అవకాశం ఉందనీ, సర్వే ఫలితాన్ని విశ్లేషించిన కాంగ్రెస్ నేతలు అంటున్నారు. బీసీలు అత్యధికంగా ఉన్న మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ కనుక బీసీ అభ్యర్థిని నిలబెడితే ఆ తేడాను సునాయాసంగా అధిగమించవచ్చని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక వామపక్షాలు టీఆర్ఎస్ కు మద్దతు పలకడం ఆ పార్టీకి కలిసి వచ్చిందని అంటున్నారు.
వామపక్షాలకు మునుగోడులో దాదాపు 15వేల ఓట్లు ఉన్నాయని, అయితే నేతలు టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించినంత మాత్రాన ఆ ఓటు గంపగుత్తగా టీఆర్ఎస్ కే పడుతుందన్న నమ్మకం లేదనీ కూడా కాంగ్రెస్ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. కనీసంలో కనీసం ఎనిమిది వేల ఓట్ల వరకూ కాంగ్రెస్ కు వచ్చే అవకాశాలున్నాయని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. మునుగోడులో బీజేపీకి క్యాడర్ లేకపోవడం, రాజగోపాలరెడ్డి రాజీనామా చేసి కమలం గూటికి చేరినా.. ఆయన వెంట కాంగ్రెస్ క్యాడర్ వెళ్లకపోవడం కాంగ్రెస్ కు కలిసొచ్చే అంశంగా పార్టీ నాయకులు భావిస్తున్నారు.
మొత్తం మీద కాంగ్రెస్ సర్వేలోనే మునుగోడులో టీఆర్ఎస్ కే విజయావకాశాలు ఉన్నాయని తేలింది. అయితే రెండు పార్టీల మధ్యా తేడా అతి స్వల్పంగా ఉండటంతో సమష్టిగా కృషి చేస్తే సానుకూల ఫలితం ఉండే అవకాశం ఉందని ఆశిస్తున్నారు.