టీడీపీతో కటీఫ్.. టీఆర్ఎస్ తో బీజేపీ..!
posted on Feb 27, 2016 @ 2:40PM
రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అస్సలు చెప్పలేం. నిన్న మొన్నటి వరకూ పిచ్చ తిట్లు తిట్టుకున్నోళ్లు కూడా సడెన్ గా ఈరోజు ఒక్కటైపోతుంటారు. రాజకీయమంటే అదేనేమో అనిపిస్తుంటుంది. ఇప్పుడు తాజా పరిణామాలు చూస్తుంటే అలానే అనిపిస్తుంది.
టీడీపీ, బీజేపీ పార్టీలు మిత్రపక్షమని అందరికీ తెలిసిందే. గత సార్వత్రిక ఎన్నికల్లో పొత్తు కలుపున్న ఈరెండు పార్టీలు.. అటు రాష్ట్ర ప్రభుత్వంలోనూ.. ఇటు కేంద్ర ప్రభుత్వంలోనూ గెలుపొంది అధికారం చేపట్టాయి. అయితే ఈరెండు పార్టీలు మిత్రపక్షాలు అయినప్పటికీ నాయకుల మధ్య మాత్రం ఎప్పుడూ బేధాభిప్రాయాలు ఉంటూనే ఉండేవి. ఇక రాష్ట్ర విభజన తరువాత పరిస్థితి చెప్పనవసరం లేదు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీల దుమ్ము దులిపేస్తుంది. ఇప్పటికే దాదాపు టీడీపీ ఖాళీ అయిపోయిందని వార్తలు వస్తున్నాయి. ఈనేపథ్యంలోనే బీజేపీ టీఆర్ఎస్ పార్టీతో పొత్తుకు రెడీ అవుతుందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
దీనిలో భాగంగానే ఎప్పుడూ కేసీఆర్ అపాయింట్ మెంట్ కు దూరంగా ఉండే మోడీ.. తనకు అపాయింట్ మెంట్ ఇవ్వడం.. ప్రధాని మోదీతో ఏకాంతంగా సమావేశం అవ్వడం.. అడిగిన వన్నీ వరుసపెట్టి ఇచ్చేయడం.. ఇవన్నీ చూస్తుంటే నిజమే అనిపించకమానదు!. అంతేకాదు తాజాగా కేంద్ర మంత్రి సురేష్ ప్రభు ప్రవేశ పెట్టిన రైల్వే బడ్జెట్ లో కూడా తెలంగాణకు బాగానే న్యాయం జరిగినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఎంపీ కవిత కూడా కవిత సంతోషం వ్యక్తం చేస్తూ ట్విట్టర్లో రైల్వే మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. దీంతో ఇప్పుడు కమలం కారెక్కబోతోంది అనే అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. కేంద్ర మంత్రివర్గంలోకి టీఆర్ఎస్ చేరిక దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. మరి ఎంతవరకూ నిజమో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.