మెగా దన్ను కోసం కమల నాథుల ఫీట్లు
posted on Nov 22, 2022 @ 3:32PM
మెగా ఫ్యామిలీ దన్ను కోసం కమనాథులు తహతహలాడిపోతున్నారు. మొన్నామధ్యన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శివారులో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఆ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవిని కేంద్రం పెద్దలు ప్రత్యేకంగా ఆహ్వానించారు. కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి చిరంజీవికి ప్రత్యేకంగా ఆహ్వానం అందించారు. ఆ వేదికపై చిరంజీవి పట్ల మోడీ కనబర్చిన ప్రేమ, ఆప్యాయత అందరి కళ్లకూ స్పష్టంగా కనిపించింది.
ఇటీవలే.. ప్రధాని మోడీ విశాఖపట్నంలో పర్యటించారు. ఆ సందర్భంగా జనసేన అధినేత, చిరంజీవి సోదరుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ప్రత్యేకంగా పిలిపించుకున్న ప్రధాని మోడీ అరగంటకు పైగా ఆయనతో చర్చలు జరిపారు. తాజాగా ప్రతిష్టాత్మక ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్- 2022’కి ఎంపికైన మెగాస్టార్ చిరంజీవిని ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా ప్రశంసలతో ముంచెత్తడం విశేషం. మోడీయే స్వయంగా అభినందించడంతో మురిసిపోయిన చిరంజీవి కూడా ప్రధానికి ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు. అంతకు ముందు చాలా నెలల క్రితం చిరంజీవి కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ఢిల్లీలో ప్రధాని మోడీతో భేటీ కావడం కూడా గమనార్హం. వారి భేటీ సందర్భంగా పలు విషయాలు చర్చించినట్లు అప్పట్లో ప్రచారం కూడా జరిగింది.
తెలంగాణలో అధికార పీఠంతో పాటు ఏపీలో ఎలాగైనా తన ఉనికిని చాటుకోవాలనే వ్యూహంతో భారతీయ జనతాపార్టీ పెద్దలు పెద్ద వ్యూహమే రచించినట్లు కనిపిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గతంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించి, రాజకీయాలను ఓ కుదుపు కుదిపిన మెగాస్టార్ కుటుంబాన్ని ఇప్పుడు తన రాజకీయ వ్యూహంలో భాగంగా వాడుకోవాలనేది కమలం నేతల ప్లాన్ గా ఉందని అంటున్నారు. అందుకే సందర్భం వచ్చినప్పుల్లా మెగా ఫ్యామిలీని ప్రసన్నం చేసుకోవడానికి ఓ రేంజ్ లో ప్రయత్నాలు చేస్తోందని చెబుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవికి ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఎక్కువే. ఆయన ఒక్క మాట చెబితే.. కోట్ల ఓట్ల దండలు తన మెడలో పడతాయని బీజేపీ పెద్దలు మైండ్ లో ఫిక్స్ అయినట్లున్నారు. అందుకే మెగాస్టార్ ఫ్యామిలీకి బీజేపీ అగ్రనేతలు ప్రాధాన్యం ఇస్తుండడం గమనార్హం. ఇక పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఎలాగూ తమ మిత్రపక్షమే కాబట్టి.. పవర్ స్టార్ కు ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ సంఖ్యలో ఉన్న అభిమానులంతా ఆయన ఏది చెబితే అది చేస్తారనేది బీజేపీ నమ్మకం. అందుకే వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను మరికాస్త మచ్చిక చేసుకోవడానికే మొన్న విశాఖలో ప్రధాని మోడీ టూర్ లో అత్యంత ప్రాధాన్యం ఇచ్చి మరీ భేటీ అవడం విశేషం. అప్పుడు ఎప్పుడో 2014 ఎన్నికల ప్రచారం సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ప్రధాని మోడీ వేదికలు పంచుకున్నారు. ఆ తర్వాత మిత్రపక్షం అధినేత అయినా అప్పటి నుంచి మళ్లీ ఒక్కసారి కూడా పవన్ కళ్యాణ్ తో మోడీ భేటీ అయింది లేదు. ఏపీలో వచ్చే ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్ పవర్ ఎలా ఉండబోతోందో ముందే పసిగట్టిన బీజేపీ పెద్దలు మళ్లీ ఆయనను భుజాన మోసేందుకు సిద్ధమైనట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చేస్తానని గట్టిగా చెప్పిన పవన్ కళ్యాణ్ స్వరం మోడీతో భేటీ అయిన తర్వాత మారిన వైనాన్ని జనం స్పష్టంగా గుర్తించారు. పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో బీజేపీని అడుగుతున్న ‘రోడ్ మ్యాప్’ విశాఖ భేటీలో మోడీ ఇచ్చి ఉంటారనే అంచనాలు బయటికి వచ్చాయి. అందుకే అప్పటిదాకా టీడీపీ- బీజేపీ, లెఫ్ట్ పార్టీలతో కలిసి వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ మాట ఎత్తని వైనాన్ని గమనిస్తున్నారు. బీజేపీతో కలిసి వెళ్లే మార్గంలో పవన్ నడుస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇవన్నీ చూస్తుంటే.. వచ్చే ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసుకునేందుకు బీజేపీ డబుల్ ఇంజిన్ మోదీ-షా జోడీ మెగాస్టార్ ఫ్యామిలీపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నట్లు అవగతమవుతోందంటున్నారు. 2014 ఎన్నికల్లో జనసేనాని తోడ్పాటు తీసుకోవడంతో మెగాస్టార్ ఫ్యామిలీకి దగ్గరవడం మొదలైన బీజేపీ ప్రయాణం చిరంజీవి కోడలు ఉపాసన మోడీతో భేటీ అయిన తర్వాత మరింత సన్నిహితం అవుతోందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే మెగా ఫ్యామిలీ మద్దతు కోసం కమలం పెద్దలు యత్నాలు చేస్తున్నారంటున్నారు.
ఈ క్రమంలోనే చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ మూవీలో ‘రాజకీయాలకు నేను దూరమైనా.. రాజకీయాలు నాకు దూరం కావడం లేదు’ అనే డైలాగ్ వచ్చిందంటున్నారు. దాంతో పాటు చిరంజీవి చదువుకున్న నర్సాపురంలోని వైఎన్ఎం కాలేజీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం హైదరాబాద్ లో జరిగింది. ఈ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరంజీవి నోట ‘రాజకీయాల్లో రాణించడం చాలా కష్టం. రాజకీయాల్లో సెన్సిటివ్ గా ఉండకూడదు. బాగా మొరటు తేలాలి. రాటు తేలాలి. మాటలు అనాలి.. అనిపించుకోవాలి. రాజకీయాలకు తమ్ముడు పవన్ కళ్యాణ్ తగినవాడు. అంటాడు.. అనిపించుకుంటాడు. మీ అందరి సహాయ సహకారాలు, ఆశీస్సులతో కచ్చితంగా ఏదో ఒక రోజు పవన్ కళ్యాణ్ ను అత్యున్నత స్థానం మనం చూస్తాం’ అనడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. చిరంజీవి చేసిన ఈ రాజకీయ వ్యాఖ్యలు కాకతాళీయం కావనేది కొసమెరుపు.