ఇక బీజేపీ వారి ఫొటోల పంచాయితీ!
posted on Sep 3, 2022 @ 12:56PM
గొడవ పడాలన్న ఆలోచనే రావాలిగానీ దేనికయినా గొడవపడే జనాలుంటారు. మా హీరో మీ హీరో అంటూ సినిమా జనాలు ఫెక్సీల గొడవల్లో పోలీస్ స్టేషన్ గుమ్మాలు ఎక్కుతూ దిగుతూంటారు. అది యువత పిచ్చి. రాజకీయాల్లోనూ ఇటీవల ఇలాంటి పోటీతత్వమే ప్రబలుతోంది. మా నాయకుడి ఫ్లెక్సీ చించేశారనీ, విపక్షాల నేత ఫ్లెక్సీ తగలెట్టారనీ పంచాయతీలు గొడవలూ జరిగాయి. మ నాయకుడి విగ్రహం విరగ్గొట్టారు, మా నేత విగ్రహం ధ్వంసం చేశారంటూ పోలీసు స్టేషన్లలో కేసులు పెట్టుకోవడమే జరిగింది. పార్టీని గెలిపించుకోవ డానికి, తమ పార్టీ ప్రాభవాన్ని అన్ని ప్రాంతాల్లో విస్తరింపచేసుకోవడానికి ఎంతటి చిత్ర విచిత్ర ఆలోచనల నైనా అమలు చేయ డానికి రాజకీయ పార్టీలు వెనుకాడటం లేదు. మరీ ముఖ్యంగా బీజేపీవారు.
కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని మోదీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లోనూ తమ పార్టీయే గెలిచి అధికారం చేజిక్కించుకోవాలన్న పట్టుదలతో అన్ని రాష్ఠ్రాల మీద దాదాపు రాజకీయ దండయాత్ర సాగిస్తున్నది. అందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల మీద కన్ను పడింది. తెలంగాణాలో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చి తాము అధికారం చేజిక్కించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో, ఎన్ని ఎత్తులు వేయాలో అన్ని వేస్తోంది కమలం పార్టీ. తాజాగా ఫోటోల పంచాయితీ ఆరంభించింది. రాజకీయంగా అనేక ఎత్తుగడలతో కేసీఆర్ ప్రభుత్వాన్ని తమ చెప్పుచేతల్లోకి తీసుకోవాలని చేస్తున్న యత్నాలు అంతగా ఫలించడం లేదు. ఎవరికీ ఎవరూ తగ్గే ప్రసక్తే లేదన్న స్థాయి లో పోటాపోటీ విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. రాష్ట్రంలో బీజేపీ నాయకులు ప్రతీరోజు కేసీఆర్ ప్రభుత్వం మీద విరుచుకుపడటం ఒక కార్యక్రమంగా చాలా సిన్సియర్‌గా చేస్తున్నారు.
ఇపుడు తెలంగాణాలో కొత్త పంచాయితీ మొదలయింది. అన్ని రేషన్ దుకాణాల్లో ప్రధాని నరేంద్ర మోదీ గారి ఫోటో ఉండాలి అని. చాలా కాలం నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రధాని, గాంధీ ఫోటోలు ఉంటూన్నాయి. ప్రధాని మారినపుడల్లా కొత్త ప్రధాని ఫోటో మారుతూంటుంది. అది సహ జం. కానీ ప్రభుత్వం బియ్యం, పప్పు దినుసులూ అందిస్తోంది గనుక రేషన్ దుకాణాల్లోనూ ప్రధాని ఫోటో ఉండి తీరాలని ఏకంగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలమ్మగారు డిమాండ్ చేశారు. అంతేనా మోడీగారి ఫొటో ఎందుకు లేదంటూ కలెక్టర్ నే నిలదీశారు.
ఇక తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ ల సీతారామన్ కామారెడ్డి జిల్లాలో పర్య టించారు. బాన్సువాడ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ బిక్నూర్ లో ఒక రేషన్ షాప్ సంద ర్శించారు. అక్కడ దుకాణంలో ప్రధాని ఫోటో లేదని ఆగ్రహించారు. కలెక్టర్ ను నిలదీశారు.
రాజకీయాంశాల్లో తెలంగాణా రాష్ట్రాన్ని నిలదీసి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నంలో పెద్దగా సఫలం కాని బీజేపీ ఇపుడు ఇక ఫోటోల విషయంలో రాష్ట్రప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనుకోవడం విడ్డూరంగా ఉందని విశ్లేషకు లు అంటున్నారు. అయితే ఇటు తెలంగాణా ప్రభుత్వం కూడా కేసీఆర్ బొమ్మను ఉత్తరాదిన పెట్టుకోవా ల్సిన ఆవశ్యకత ఉందని కేంద్రం నుంచి తెలంగాణకు అందుతున్న సొమ్ముల కంటే పన్నుల రూపంలో తెలంగాణ నుంచి కేంద్రానికి వెళుతున్న సమ్ములే అధికమని ఆయన గణాంకాలతో సహా వివరించి, కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ గాలీ తీసేశారు. రేషన్ దుకాణాలలో మోడీ ఫొటోలు పెట్టాలంటే బీజేపీ పాలిత రాష్ట్రాలలోని ప్రభుత్వ కార్యాలయాలలో కేసీఆర్ ఫొటోలు పెట్టాల్సి ఉంటుంది పెడతారా అని నిలదీశారు. మొత్తానికి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బొమ్మల పంచాయతీ జోరుగా సాగుతోంది