పుదిచ్చేరికి ప్రత్యేక హోదా.. మరి ఏపీకి? జగన్ రెడ్డి తాకట్టు పెట్టారా?
posted on Apr 1, 2021 @ 12:16PM
ప్రత్యేక హోదా.. ఆంధ్రప్రదేశ్ కు అత్యంత కీలకం. విభజనతో ఆర్థిక ఇబ్బందుల్లో పడిన ఏపీకి ప్రత్యేక హోదానే శరణ్యం. రాష్ట్ర విభజన చట్టంలోనూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఉంది. కాని రాష్ట్ర విభజన జరిగి ఏడేళ్లు అవుతున్నా ప్రత్యేక హోదా.. ఆంధ్రాకు కలగానే మిగిలిపోయింది. ప్రత్యేక హోదా విషయాన్ని పట్టించుకోవడం లేదు కేంద్ర సర్కార్. ప్లానింగ్ కమిషన్ సిఫారసుల పేరుతో మాట మార్చింది మోడీ సర్కార్. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని, ఇక పై దేశంలో ఏ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇచ్చేది ఉండదని చెబుతూ వస్తోంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న పుదిచ్చెరి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ప్రత్యేక హోదా జపం చేస్తోంది కమలదళం. బీజేపీని గెలిపిస్తే పుదిచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించింది. బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. పుదిచ్చేరిలో బీజేపీ ప్రభుత్వం వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని స్వయంగా చెప్పారు.
పుదిచ్చేరి ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీనే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ఆంధ్రప్రదేశ్ లో మంటలు రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అయితే... పుదిచ్చేరిలో ఎలా సాధ్యమని ఏపీ జనాలు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుందని నిలదీస్తున్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఏపీ జనాలు ఏడేండ్లుగా పోరాడుతూనే ఉన్నారు. 2014 ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీ తిరుపతి వేదికగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. కాని అధికారంలోకి వచ్చాకా మర్చిపోయారు. ప్రత్యేక హోదా కాదు ప్యాకేజీ ఇస్తామని చెప్పారు. అది కూడా ఇవ్వలేదు. కేంద్రం చేస్తున్న ఈ అన్యాయం భరించలేకే 2018లో ఎన్డీఏ నుంచి బయటకొచ్చింది టీడీపీ. కేంద్రం తీరును ఎండగడుతూ పెద్ద ఎత్తున ఉద్యమించారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు.
2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదానే తమ మొదటి లక్ష్యమని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేశారు. వైసీపీకి అధికారం ఇస్తే కేంద్ర సర్కార్ మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చి దాదాపు 22 నెలలు అయింది. వైసీపీకి 22 మంది లోక్ సభ సభ్యులున్నారు. కాని ప్రత్యేక హోదాపై మాత్రం మాట్లాడటం లేదు. కేంద్రం మెడలు వంచుతానన్న జగన్ రెడ్డి... ఢిల్లీకి వెళ్లి కేంద్రం పెద్దల ముందు వంగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని కనీసం ప్రశ్నించడం లేదని ఏపీ జనాలు, ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. 22 మంది ఎంపీలున్నా పార్లమెంట్ లో ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నిస్తున్నాయి. తన సొంత ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాను కేంద్రానికి జగన్ రెడ్డి తాకట్టు పెట్టారని కొందరు నేతలు ఆరోపిస్తున్నారు. తనపై ఉన్న సీబీఐ, ఈడీ కేసుల కోసం మోడీ సర్కార్ కు జగన్ తలవంచారని విమర్శిస్తున్నారు.
బీజేపీ తీరు, వైసీపీ నేతల మౌనంపై ప్రతిపక్ష టీడీపీ నేతలుసీరియస్ గా స్పందిస్తున్నారు. జగన్ సర్కార్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విటర్ వేదికగా ఫైరయ్యారు. మోడీ మెడ వంచి తెస్తానన్న ప్రత్యేకహోదాని ఫేక్ సీఎం తాకట్టు పెట్టారంటూ ఎద్దేవా చేశారు. ఇప్పుడు బీజేపీ పుదుచ్చేరికి స్పెషల్ స్టేటస్ ఇస్తామంటోందని, ఏపీకి ముగిసిన అధ్యాయమైన ప్రత్యేకహోదా పుదుచ్చేరిలో ఎలా మొదలవుతుందని లోకేష్ ప్రశ్నించారు. రాష్ట్రంలో కమలంతో రహస్య ప్రయాణాన్ని కట్టిపెట్టేసి, పుదుచ్చేరిలో బీజేపీ మిత్రుల గెలుపు కోసం పార్టీ నాయకులతో జగన్ రెడ్డి విస్తృత ప్రచారం చేయిస్తున్నారని విమర్శించారు. కేసుల గురించి కాకుండా.. ప్రత్యేకహోదా కోసం ఇప్పటికైనా గట్టిగా అడగండని నారా లోకేష్ ట్విట్టర్ వేదిగా సూచించారు.