ఏపీలో బీజేపీ రూటదేనా?
posted on Jan 2, 2024 @ 10:56AM
తెలుగుదేశం,జనసేన పార్టీలు ఇప్పటికే తమ పొత్తు ఖరారు చేశాయి. సీట్ల సర్దుబాటుపై చర్చలు కూడా దాదాపు ఓ కొలిక్కి వచ్చాయి. ఇరు పార్టీలూ సమన్వయంతో క్షేత్ర స్థాయిలో పని చేయడం కూడా మొదలెట్టేశాయి. అయితే ఏపీ రాజకీయాలలో బీజేపీ విషయంలో మాత్రం ఒక గందరగొళం, అయోమయం నెలకొని ఉంది. ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అన్నట్లుగా ఆ పార్టీ ఏపీలోని అధికార వైసీపీ విషయంలో వ్యవహరిస్తున్నది.
బీజేపీ కూడా ఏపీలో తెలుగుదేశం, జనసేన పార్టీలతో కలిసే ఎన్నికలకు వెళుతుందన్న చర్చ కూడా ఏపీ రాజకీయాలలో చాలా గట్టిగానే జరుగుతోంది. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పురంధేశ్వరి బాధ్యతలు చేపట్టినప్పటి నంచీ ఇది మరింత జోరందుకుంది. బీజేపీకి ముందు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు.. జాతీయ పార్టీ అయిన బీజేపీని ఏపీలో అధికార వైసీపీకి బీ టీమ్ అన్నట్లుగా మార్చేశారు. అప్పట్లో పార్టీ రాష్ట్ర నాయకులలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం కావడంతో పార్టీ హై కమాండ్ రంగంలోకి దిగింది. అప్పట్లో రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ స్వయంగా గ్రామ గ్రామాన అధికార వైసీపీ తప్పిదాలపై చార్జిషీట్లు విడుదల చేయాలని పార్టీ రాష్ట్ర శాఖను ఆదేశించారు కూడా. అయితే సోము హయాంలో మాత్రం వైసీపీతో బీజేపీ రాష్ట్ర శాఖ బాహాటంగానే చెలిమి చేసింది.
చివరకు సోము వీర్రాజును పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి ఓ ఫోన్ కాల్ తో తప్పించేసి, ఆయన స్థానంలో దగ్గుబాటి పురందేశ్వరికి పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పగించారు. పురందేశ్వరి బీజేపీ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన క్షణం నుంచి జగన్ సర్కార్ ఆర్థిక అవకతవకలపై విమర్శనాస్త్రాలు సంధించడమే కాకుండా, పార్టీ అధిష్ఠానానికీ, కేంద్ర ప్రభుత్వానికి కూడా వరుస నివేదికలు అందజేశారు. దీంతో వైసీపీ నేతలు పురంధేశ్వరి టార్గెట్ గా ఇష్టారీతిగా విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే బీజేపీతో ఇంత కాలం జగన్ సాగించిన రహస్యమైత్రి భగ్నమైందన్న వార్తలు కూడా వినవచ్చాయి. ఆ వార్తలకు బలం చేకూరచేలా పురంధేశ్వరి ఏపీలో బీజేపీ జనసేనల మైత్రి కొనసాగుతోందనీ, అవసరమైతే తెలుగుదేశం, జనసేన కూటమితో బీజేపీ కలిసి సాగుతుందని ప్రకటించారు.
దీంతో ఇంత కాలం బీజేపీ ఎటు అన్న సందిగ్ధతకు దాదాపు తెరపడినట్లేనని పరిశీలకులు విశ్లేషి స్తున్నారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు కూడా తెదేపా, జనసేన మధ్య కుదిరిన పొత్తును వైసీపీ వారు ఏమీ చేయలేరని, అలాగే తెదేపా, జనసేన కూటమితో బిజెపి కలవడాన్ని జగన్ పార్టీ ఆపలేదని వ్యాఖ్యానించారు. తాను తెలుగుదేశం, జనసేన, బీజేపీల మధ్య చెలిమి ఉండాలనే కోరుకుంటున్నానన్నారు.