తెలంగాణలో బీజేపీ.. ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు!?
posted on Oct 1, 2024 @ 10:03AM
భారతీయ జనతాపార్టీ జాతీయ స్థాయిలో గత పదేళ్లుగా చక్రం తిప్పుతున్న ఈ పార్టీ దక్షిణాదిలో మాత్రం పట్టు సాధించడంలో విఫలమౌతోంది. కర్నాటకలో ఏదో మేరకు బలం ఉన్నా.. అక్కడ ఆ పార్టీ స్థిరంగా వేళ్లూనుకుందని చెప్పడం కష్టం. ఇక దక్షిణాది ఆ పార్టీకి ఏదో మేరకు ఆశలు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. తెలంగాణలో బీజేపీకి పట్టణ ప్రాంతాలలో పట్టు ఉన్నప్పటికీ గ్రామీణంలో మాత్రం అంతంత మాత్రమే. అయితే తెలంగాణలో అధికార పీఠం అందుకోవాలన్న ఆ పార్టీ ఆశలు నెరవేరాలంటే మాత్రం ఆ బలం సరిపోదు. ఈ విషయం బీజేపీ అగ్రనాయత్వానికీ స్పష్టంగా తెలుసు. దాంతో ప్రజలలో అంతో ఇంతో పలుకుబడి ఉంది అంటే చాలా వారి రాజకీయ నేపథ్యం, వారి సైద్ధాంతాలు వంటి వాటిని ఇసుమంతైనా పట్టించుకోకుండా దొరికిన వారిని దొరికి నట్లు పార్టీలోకి ఆహ్వానించేసి కండువాలు కప్పేసింది. రాష్ట్రంలో ఇక అధికారమే తరువాయి అన్నట్లుగా భావించింది. అయితే 2023 ఎన్నికలు ఆ పార్టీ విశ్వాసంపై చావు దెబ్బ కొట్టాయి. పార్టీలో విభేదాలు తారస్థాయికి చేరడానికి ఇష్టారీతిగా పార్టీలో చేరికలను ప్రోత్సహించడమే ఇందుకు కారణమని పరిశీలకులు విశ్లేషించారు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికలలో మళ్లీ బీజేపీ రాష్ట్రంలో బలం పుంజుకున్నట్లు కనిపించింది. ఏకంగా 9 లోక్ సభ స్థానాలను గెలుచుకుంది. దీంతో 2028 ఎన్నికల నాటికి రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. అయితే ఆ అడుగులు తడబడుతున్నాయి.
రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్లుగా ఉన్నాయి. రాష్ట్రంలో బీజేపీలో నాయకత్వ లోపం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. క్యాడర్ కు దిశా నిర్దేశం చేసి ముందుండి నడిపించే నేత కరవయ్యారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల తరువాత రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ తరువాత స్థానం బీజేపీదే.. ప్రత్నామ్నాయం బీజేపీనే అన్నట్లుగా పరిస్థితి మారింది. పదేళ్ల పాటు రాష్ట్రంలో అధకారంలో ఉన్న బీఆర్ఎస్ రాష్ట్రంలో మూడో స్థానానికి పడిపోయింది అనిపించేలా పరిస్థితులు మారాయి. అయితే బీజేపీ అంతర్గత కలహాలు, విభేదాలతో ఆ పరిస్థితిని చేజేతులా జారవిడుచుకున్నట్లు కనిపిస్తుంది. రాష్ట్ర నాయకత్వ మార్పు కోసం ఆ పార్టీలో చాలా కాలంగా డిమాండ్ వినిపిస్తున్నా, కిషన్ రెడ్డి స్థానంలో రాష్ట్ర పార్టీకి మరో అధ్యక్షుడిని నియమించే విషయంలో బీజేపీ హైకమాండ్ మీనమేషాలు లెక్కించింది. గతంలో బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యకుడిగా ఉన్న సమయంలో అప్పటి అధికార బిఆర్ఎస్ పార్టీ మీద దూకుడుగా ముందుకెళ్ళేది బీజేపీ. అలాగే అటు కాంగ్రెస్ పార్టీని కూడా తన విమర్శలతో ఇరుకున పెట్టి అప్పట్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మూడో స్థానానికి నెట్టేసింది బీజేపీ. కానీ ఎప్పుడైతే బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడిగా పగ్గాలు చేపట్టారో అప్పటి నుంచీ బీజేపీలో దూకుడు మాయమైంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో పార్టీలో కొద్దిగా ఐక్యతా రాగం వినిపించినా, ఇప్పుడు ఆ ఐక్యత కనిపించడం లేదు.
అలాగే అటు హైడ్రాతో కాంగ్రెస్ సర్కార్ కూల్చివేతలతో ప్రజల వ్యతిరే కతను మూటకట్టుకుంటుంటే బీజేపీ చేష్టలుడిగి నిలబడిపోయింది. అదే సమయంలో ఇక అయిపోయిందనుకున్న బీఆర్ఎస్ పుంజుకుని ప్రజా మద్దతును కూడగట్టుకుని హైడ్రాకు వ్యతిరేకంగా జనంలోకి బలంగా వెడుతోంది. కానీ బీజేపీ మాత్రం స్తబ్దుగా మిగిలిపోయింది. అంది వచ్చిన అవకాశాలను జారవిడుచుకుని తెలంగాణలో బీజేపీ రోజురోజుకూ బలహీనమౌతోందని పార్టీ శ్రేణులే అంటున్నాయి.