Read more!

పతంజలి పేరుతో లో దుస్తుల వ్యాపారమా?.. బాబా రామ్ దేవ్ పై బీజేపీ ఎంపీ ఫైర్

యోగాగురు రామ్ దేవ్ బాబా.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. పతంజలి బ్రాండ్ తో ఆయుర్వేద ఉత్పత్తులను విస్తృతంగా మార్కెటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా కోవిడ్ సమయంలో ఆయన చేసిన ప్రచారం, ప్రకటనలు వివాదాస్పదమయ్యాయి. పతంజలి బ్రాండ్ తో బాబారామ్ దేవ్, ఆ గ్రూప్ ఎండి బాలకృష్ణలు కోట్లాది రూపాయల టర్నోవర్ తో వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా.. కాషాయ వస్త్రధారణతో బాబా రామ్ దేవ్ హిందుత్వకు ప్రతీకగా దర్శనమిస్తుంటారు. అలాగే ఆయన మాటలు, ప్రసంగాలతో తాను కేంద్రంలోని అధికార బీజేపీకి దగ్గర మనిషినన్న బిల్డప్ ఇస్తుంటారు. అయితే ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి హిందుత్వ కార్డ్ ఉపయోగించడం, అలాగే ఆధునిక యోగా పితామహుడు పతంజలి పేరును తమ వ్యాపారాలకు బ్రాండ్ గా చేసుకోవడంపై బీజేపీ గుర్రుగా ఉంది. ఇది తగదని హెచ్చరిస్తోంది. 

ఆయుర్వేదిక్ ఉత్పత్తుల బ్రాండ్ గా పతంజలి పేరును ఉపయోగించుకోవడంపై బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ విమర్శలు గుప్పించారు. మామూలుగా పతంజలి అనే పేరు ఆధ్మాత్మికతకు మారుపేరుగా అందరూ భావిస్తారు. ఆధునిక యోగా పితామహుడిగా మహర్షి పతంజలి పేరు ప్రసిద్ధి పొందింది. అటువంటి పేరును తమ వ్యాపారానికి సోపానంగా మార్చుకోవడాన్ని బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తప్పుపట్టారు. కేవలం పతంజలి పేరు కారణంగానే నాణ్యత గురించి పట్టించుకోకుండా జనం పెద్ద ఎత్తున బాబారామ్ దేవ్ ఆయుర్వేదిక్ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారన్నారు.

పతంజలి పేరును ఉపయోగించుకోవడం మాని సొంత పేరుతో బ్రాండ్ నిర్మించుకోవాలని బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్  బాబారామ్ దేవ్ కు సూచించారు.  పతంజలి పేరును వారి వ్యాపార సంస్థకు తీసివేయాలని,  అలా చేయకుండా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని, అలాగే న్యాయపరమైన చర్యలకు దిగుతామని హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్ లోని మహర్షి పతంజలి జన్మస్థలమైన కొండార్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ హెచ్చరికలు చేశారు.  

రామ్‌దేవ్ వారి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడాన్ని తాన తప్పు పట్టడం లేదనీ,  పంతంజలి పేరుమీద నెయ్యి, నూనె, సబ్బు, మసాలాలు, లోదుస్తుల వ్యాపారం చేయడాన్ని తప్పుపడుతున్నాననీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అన్నారు.