Read more!

కేసీఆర్ పై హత్య కేసు.. బండి డిమాండ్ కు కారణమేంటి?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై హత్య కేసు నమోదు చేయాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. అంతటి తీవ్ర డిమాండ్ కు కారణమేమిటంటే. ఫారెస్టు అధికారి శ్రీనివాసరావు రెండు రోజుల కిందట భద్రాద్రి జిల్లాలో పోడు సమస్యలపై ఉద్యమిస్తున్న గుత్తి కోయల దాడిలో మరణించిన నేపథ్యంలో ఆ హత్యకు కేసీఆర్ దే బాధ్యత అని బండి సంజయ్ ఆరోపించారు.

ఫారెస్టు అధికారి చంద్రశేఖరరావుది ప్రభుత్వ హత్యేనని ఆయన తీవ్ర ఆరోపణలు గుప్పించారు. సీఎం కేసీఆర్ పై హత్య కేసు నమోదు చేయాలన్నారు. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానని, పోడు సాగు చేసుకునే రైతులకు పట్టాలిస్తాననీ కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ నెరవేర్చడంలో విఫలమైనందునే పోడు రైతులు ఆందోళన బాట పట్టారన్నారు. ఇచ్చిన హామీలను విస్మరించి కేంద్రాన్ని బదనాం చేయడమే కేసీఆర్ పనిగా పెట్టుకున్నారని బండి అన్నారు.

పోడు సమస్యల విషయంలో కేసీఆర్ వ్యవహరించిన తీరే పోడు రైతుల ఆగ్రహానికి కారణమన్న బండి సంజయ్ వారి ధర్మాగ్రహం ఫారెస్టు అధికారిని బలితీసుకుందన్నారు. ఇలా ఉండగా ఫారెస్టు అధికారి శ్రీనివాసరావుది ప్రభుత్వ హత్యేనని ఇప్పటికే కాంగ్రెస్ విమర్శలు గుప్పించిన సంగతి విదితమే.  ఇక దర్యాప్తు సంస్థల తకిణీలూ, సోదాలపై రాజకీయ విమర్శలు చేయడాన్ని కూడా బండి సంజయ్ తప్పుపట్టారు.

ప్రజలను వేధించి, అడ్డగోలుగా ఆస్తులు సంపాదించిన వారిని తెరాస వారైనందుకు వదిలేయాలా, వారిపై దర్యాప్తు సంస్థలు నజర్ పెట్టద్దా అని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీపై కూడా సీబీఐ, ఐటీ, ఈడీ దాడులు జరిగిన సంగతిని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు. దర్యాప్తు సంస్థలు ప్రభుత్వ నియంత్రణలో పని చేయవనీ, అవి స్వతంత్ర సంస్థలనీ బండి సంజయ్ అన్నారు.