కన్వర్షన్ క్వీన్.. కమీషన్ క్వీన్!
posted on Apr 1, 2021 @ 2:44PM
కల్వకుంట్ల కవిత.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు.. నిజామాబాద్ మాజీ ఎంపీ.. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. తెలంగాణ రాజకీయాల్లో కవితది కీ రోల్. వైఎస్ షర్మిల... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ.. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సోదరి.. తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నారు షర్మిల. ఏప్రిల్ 9న ఖమ్మంలో జరగనున్న సభలో ఆమె పార్టీ పేరును ప్రకటించనున్నారు. గతంలో జగన్ జైలుకు వెళ్లినప్పుడు సుదీర్ఘ పాదయాత్ర చేశారు షర్మిల. ఈ ఇద్దరు మహిళా నేతలపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ షర్మిలను కన్వర్షన్ క్వీన్ గా అభివర్ణించారు ఎంపీ అర్వింద్. తెలంగాణలో మత మార్పిడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని షర్మిలను హెచ్చరించారు. తెలంగాణ వెళ్లాలంటే వీసా తీసుకోవాలా? అని గతంలో మాట్లాడిన వైఎస్ కూతురు.. ఇప్పుడు తెలంగాణలో వీసా తీసుకుని పార్టీ పెడుతున్నారా? అని అర్వింద్ ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కవితను కమీషన్ క్వీన్ అన్నారు. తెలంగాణలో జరిగే ప్రతి పనిలో కవితకు కమీషన్ వెళుతుందని ఆరోపించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఉండటం తెలంగాణ ప్రజల దురదృష్టమన్నారు బీజేపీ ఎంపీ.
పార్టీ కార్యాలయంలో మీడియాతో చిట్ చాట్ చేసిన ఎంపీ అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పునరుజివం అయ్యే అవకాశం లేదన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అంతరించిపోనుందని చెప్పారు. నాగార్జున సాగర్, తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తానని తెలిపారు ఎంపీ అర్వింద్. నాగార్జున సాగర్ ఎన్నికలో టీఆరెస్ అధికార దుర్వినియోగాయానికి పాల్పడుతుందని విమర్శించారు. ఇతర పార్టీ నేతలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. తమిళనాడు బీజేపీ మ్యానిఫెస్టేలో పసుపు బోర్డు అంశం ఆ రాష్ట్రానికి సంబంధించిందని అర్వింద్ చెప్పారు. బోర్డు ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం తన విధానాన్ని పార్లమెంటులో స్పష్టంగా ప్రకటించిందని తెలిపారు. రీజనల్ స్పైసెస్ పార్క్ ద్వారా పసుపు రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. దిగుబడులు నిలిపేయటంతో పసుపు కి ధర కూడా పెరిగిందని వెల్లడించారు.
నిజామాబాద్ జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు కేసీఆర్ విసిరే బిస్కట్లు తినే కుక్కలు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు అర్వింద్. తనను విమర్శించటం తప్ప జిల్లా నేతలకు వేరే పనే లేదన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తేరుస్తానని కేసీఆర్ ఈ ప్రాంత చెరుకు రైతులను మోసం చేశారని మండిపడ్డారు. జిల్లాలో రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాన్ని మంత్రి ప్రశాంత్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే కేసీఆర్, కేటీఆర్ జైలుకి వెళ్ళటం ఖాయమన్నాుర నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్.