పోలవరం రివర్స్ టెండరింగ్ తో ఆదాపై అనుమానాలు .. కూపీ లాగుతున్న బీజేపీ!!
posted on Oct 11, 2019 @ 12:31PM
నిన్న మొన్నటి దాకా ఏపీలో హాట్ టాపిక్ గా నడచిన అంశం 'పోలవరం రివర్స్ టెండరింగ్'. ఏపిలో రివర్స్ టెండరింగ్ పై కాషాయదళం కన్నేసింది. రివర్స్ టెండరింగ్ ద్వారా కోట్ల రూపాయలు ఆదా అయిందని స్వయంగా సిఎం జగన్ ప్రధాని దగ్గర ప్రస్తావించారు. నిజంగా అంత జరిగుంటే మరి రాష్ట్రంలో వైసీపీ నేతలకు కనీసం సమాచారం ఎందుకు లేదు అన్న కోణంలో బిజెపి ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. అన్ని కోట్లు ఆదా అయ్యాయని సర్కారు ఎందుకు ప్రచారం చేయటం లేదు అన్న విషయం పై చర్చకి తెరతీసింది.
జగన్ ప్రభుత్వం ఒక పక్క నవరత్నాలు అమలు చేసే పనిలో ఉండగా మరోపక్క రివర్సు టెండరింగ్ లో నిధులు ఆదా చేసే అంశాలపై కూడా దృష్టి పెడుతూ రెండు కళ్లుగా భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. మొన్నటికి మొన్న జగన్ ఢిల్లీ వెళ్లి మరీ ప్రధాని దగ్గర రివర్సు టెండరింగ్ అంశాన్ని ప్రస్తావించారు. రివర్సు టెండరింగ్ ద్వారా ఎనిమిది వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై భారం పడకుండా చూస్తామని మోదీకి చెప్పినట్లు వార్తలొచ్చాయి .ఈ వ్యవహారం తీవ్ర స్థాయిలో చర్చనీయాంశమైంది .అయితే రివర్స్ టెండరింగ్ లో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి. పనులకు సంబంధించిన వాస్తవ లెక్కలు ఎలా ఉన్నాయి. నాణ్యత ప్రమాణాలు ఎలా పాటిస్తున్నారనే విషయాలు ఇంత వరకూ ఎక్కడా బయటికిరాలేదు.మోదీ దగ్గర జగన్ ప్రస్తావించిన రివర్సు టెండరింగ్ అంశాలపై ఏపీ బీజేపీ నేతలు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఢిల్లీలో జగన్ ఏం చెప్పారు, రాష్ట్రంలో వాస్తవ పరిస్థితి ఏంటనే విషయాన్ని కూలంకషంగా పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా జగన్ చెప్పినట్లే వందల కోట్లు ఆదా అయ్యయా అది ఎలా సాధ్యమైందనే సమాచారాన్ని ప్రభుత్వ వర్గాలతో పాటు ఇతరత్రా నిపుణుల ద్వారా తెలుసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.కొన్ని సందర్భాల్లో బిజెపి నేతలు ఒకడుగు ముందుకేసి బీజేపీతో సాన్నిహిత్యంగా ఉంటున్న వైసీపీ నేతల నుంచి కూడా సమాచారం తీసుకొంటున్నారు.
టిడిపి హయాంలో పెద్ద స్థాయిలో అవినీతి జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో రివర్సు టెండరింగ్ ద్వారా ప్రభుత్వ ఖజానాకు నిధులు ఆదా చేస్తే జగన్ సర్కార్ విజయం సాధించినట్లే.ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే ఇదంతా జరిగితే ప్రభుత్వ ఘనతగా చెప్పుకోవచ్చు ప్రచారం చేసుకోవచ్చు ,కానీ ఏపీ సర్కార్ ఎక్కడా ఈ విషయంలో పెద్దగా ప్రచార ఆర్భాటం చేయడంలేదు.మంత్రుల దగ్గర కూడా తగినంత సమాచారం ఇవ్వడంలేదు. అధికారులు కూడా ఈ విషయంలో తడబడుతున్నారు. దీంతో ఈ అంశంపై ఏపీ బీజేపీ ఫోకస్ చేసింది.నిజంగా జగన్ సర్కారు ఖజానా సొమ్మును కాపాడిన ఆ విషయాలు ఇప్పట్లో తెలిసే అవకాశం లేదు ఎందుకంటే పనులు పూర్తయిన తరవాత బిల్లుల చెల్లింపులు కూడా జరిగిన తర్వాత కానీ వివరాలు బయటకు వచ్చే అవకాశాలు లేవు.కాని జగన్ అప్పుడే ఈ విషయాలను ఎలా చెప్పారనే అంశంపై బిజెపి నేతలు వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు వచ్చాక అధిష్ఠానానికి నివేదిక పంపడానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయని బీజేపీ లో ప్రచారం జరుగుతోంది. బీజేపీ నేతలు ప్రశ్నలకు ఇక జగన్ సర్కార్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.