పవన్ కు బీజేపీ నుంచి పిలుపు.. పవన్ వ్యాఖ్యలతో కమలంలో కుదుపు
posted on Oct 19, 2022 @ 5:27PM
మంగళగిరిలో మంగళవారం జరిగిన జనసేన కార్యకర్తల సదస్సులో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు బీజేపీలో ఒక్కసారిగా ప్రకంపనలు పుట్టించాయి. మిత్రపక్షమైనా బీజేపీతో కలిసి నడవడానికి రాష్ట్రంలో ఆ పార్టీ నాయకత్వం వ్యవహరిస్తున్న తీరు పెద్ద అవరోధంగా మారిందని పవన్ కల్యాణ చేసిన వ్యాఖ్యలతో బీజేపీ హై కమాండ్ లో కదలిక వచ్చింది. వెంటనే స్పందించింది. జనసేనాని పవన్ కల్యాణ్ ను హస్తిన రావాల్సిందిగా బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింద. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అయితే మంగళవారంమే పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై సోము వీర్రాజు తన అధిష్టానానికి ఏమి వివరణ ఇచ్చారో.. ఏమో గానీ.. బుధవారం మధ్యాహ్నానికల్లా సీన్ మారిపోయింది. ఆ వెంటనే పవన్ కళ్యాణ్ ను ఢిల్లీ రావాల్సిందిగా బీజేపీ పెద్దల నుంచి పిలుపు వచ్చిందని మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి.
‘నేను వ్యూహాలు మార్చుకోవాల్సి వచ్చింది. ఇకపై ఏపీలో కొత్త రాజకీయ ముఖచిత్రం చూస్తారు’ అంటూ జనసేన నేతలు, కార్యకర్తల సమావేశంలో పవన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. బీజేపీని రోడ్ మ్యాప్ ఇవ్వమని అడిగి నెలలు గడుస్తున్నా ఆ పార్టీ పట్టించుకోకపోవడంతో సమయం గడిచిపోతోందంటూ పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేయడమే బీజేపీ వర్గాల్లో కంగారుకు కారణమై ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. దానికి తోడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ బస చేసిన నోవాటెల్ హోటల్ కు వెళ్లి సుమారు గంట సేపు ప్రైవేటుగా చర్చలు జరపడం కూడా బీజేపీలో కంగారు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీజేపీ మీద, మోడీ మీద తనకు గౌరవం ఉందంటూనే ‘అలా అని చెప్పి నా స్థాయిని చంపుకోలేను.. ఊడిగం చేయలేను’ అంటూ పవన్ కల్యాణ్ చేసిన ఘాటు వ్యాఖ్యలు కమలం పెద్దలను ఇరుకున పెట్టాయని పరిశీలకులు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తమతో కలిసి నడుస్తారని ఇప్పటి దాకా బీజేపీ నేతలు భావిస్తూ వచ్చారు. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ వ్యూహాలు మార్చుకుంటున్నట్లు ప్రకటించడంతో కమలం పార్టీకి గాలి ఆడని పరిస్థితి ఎదురైందని అంటున్నారు.
నిజానికి బీజేపీ- జనసేన మధ్య 2019 ఎన్నికల తరువాత నుంచీ పొత్తు ఉంది. అయితే చాలా కాలంగా పవన్ కళ్యాణ్ ను బీజేపీ అంతగా పట్టించుకున్న దాఖలాలు లేవు. జనసేనతో తాము పొత్తులోనే ఉన్నాయని బీజేపీ రాష్ట్ర నాయకత్వం అప్పుడప్పుడూ చెబుతున్నా కొంతకాలంగా ఆ రెండు పార్టీలు కలిసి ఎలాంటి ఉద్యమం కానీ కార్యక్రమం కానీ నిర్వహించలేదు. విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ పర్యటించకుండా పోలీసులు అడ్డుకోవడంతో పాటు రెండు రోజులు ఆయన బసచేసిన హొటల్ నుంచి బయటకు రానివ్వకుండా నిర్బంధించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గత ఆదివారంనాడు విజయవాడకు తిరిగివచ్చి ‘ఇక్కడే తేల్చుకుంటా’ అని చెప్పడం.. మంగళగిరి ఆఫీసులో తమ పార్టీ నేతలు, శ్రేణుల సమావేశంలో ఆవేశపూరితంగా మాట్లాడారు.
విశాఖ ఘటన తర్వాత బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు పవన్ కళ్యాణ్ ను పరామర్శించి, మద్దతు తెలిపినప్పటికీ తనకు బీజేపీ పూర్తి మద్దతు ఇచ్చిన దాఖలాలు పవన్ కళ్యాణ్ కు కనిపించలేదు. మరో పక్కన విశాఖ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అందరి కంటే ముందుగా స్పందిచి పవన్ కు సంఘీభావం ప్రకటిస్తూ ట్వీట్ చేయడం.. మంగళగిరి సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రసంగించిన కొద్ది సేపటికే తెలుగుదేశం అధినేత చంద్రబాబు వెళ్లి పవన్ కు కలసి సంఘీభావం తెలపడంతో బీజేపీ నేతల్లో కంగారు మొదలైనట్లు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీకి రావాలని పవన్ కళ్యాణ్ కు బీజేపీ పెద్దల నుంచి పిలుపు వచ్చిందని అంచనా వేస్తున్నారు.
పవన్ కల్యాణ్ విషయంలో బీజేపీ అధిష్టానం వైఖరిపై ఆ పార్టీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ తో సఖ్యత విషయంలో ఏపీ బీజేపీ నాయకత్వం విఫలమైందని బాంబు పేల్చడం గమనార్హం. పవన్ తో సమన్వయం చేసుకోవడంలో సోము వీర్రాజు దారుణంగా విఫలమయ్యారని తన మనసులో మాటను కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. బీజేపీ అధిష్టానం పవన్ కళ్యాణ్ ను లైట్ తీసుకోవడం, రాష్ట్ర నాయకత్వం కూడా పవన్ కు అంతగా ప్రాముఖ్యం ఇవ్వకపోవడం వల్లే జనసేనకు బీజేపీ దూరమయ్యే పరిస్థితి వచ్చిందని కన్నా లక్ష్మీనారాయణ విస్పష్టంగా తేల్చి చెప్పడంతో.. జనసేనతో మైత్రిని కొనసాగించడంలో బీజేపీ నేతల ఉదాశీనతపై కమలం పార్టీలో ఇంత వరకూ నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి ఒక్కసారిగా భగ్గుమందని పరిశీలకులు అంటున్నారు.
ముఖ్యంగా బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు కమలంలో సెగలు పుట్టించాయి. ఏపీలో బీజేపీ పరిస్థితి ఇంత దయనీయంగా మారడానికి, చివరికి రాష్ట్రంలో పార్టీకి ఉన్న ఏకైక మిత్రపక్షం కూడా దూరమవ్వడానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వైఖరే కారణమని కన్నా కుండబద్దలు కొట్టారు.
అసలు రాష్ట్ర పార్టీలో ఏం జరుగుతోందో తమకెవరికీ తెలియడం లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర పార్టీ అంటే తానొక్కడినే అన్న భావంతో సోము వ్యవహరించడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు సమస్య అంతా సోము వీర్రాజు వల్లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోము వీర్రాజు వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ అసంతృప్తి సెగలు హస్తినను కూడా తాకడంతోనే పవన్ కల్యాణ్ కు బీజేపీ హై కమాండ్ నుంచి ఆహ్వానం వచ్చిందని అంటున్నారు.