జీరోగా మిగిలిన సూపర్ స్టార్! బీజేపీ పావుగా రజనీ కాంత్
posted on Apr 2, 2021 @ 2:57PM
రజనీకాంత్.. సినిమాల్లో సూపర్ స్టార్... ఆయనకు లక్షలాది మంది ఫాన్స్. రజనీ ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్టు అన్నమాట. సినిమాలో బాప్ గా వెలుగొందారు. అంతటి సూపర్ స్టార్ రాజకీయ క్రీడలో మాత్రం జీరోగా మారిపోయారు. బాషాను మించిన పొలిటికల్ బాప్ నరేంద్ర మోడీ చేతిలో పావుగా మారిపోయారు. పార్టీ పెడతానంటూ హడావుడి చేసి.. చివరి వెనక్కి తగ్గిన రజనీ కాంత్.. ప్రధాని మోడీ, అమిత్ షా టీమ్ ఆడిన గేమ్ లో పరువు తీసుకున్నారనే విమర్శలు వస్తున్నాయి.
రజనీకాంత్‌కు 2021 సంవత్సరానికి గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించింది కేంద్ర సర్కార్. ఆ అత్యుత్తమ అవార్డుకు ఆయన వంద శాతం అర్హుడే. నటనతో, తనదైన శ్టైలితో, ప్రత్యేక మేనరిజంతో.. ఏళ్ల పాటు భారత ప్రేక్షకులను అలరించిన అద్బుత నటుడు రజనీకాంత్. అయితే.. ఆ తమిళ తలైవాని అవార్డు వరించిన సమయం, సందర్భం, విధానం మాత్రం నిస్సందేహంగా వివాదాస్పదమే. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ కమలనాథులు విసిరిన రాజకీయ పాచిక.. ఫాల్కే అవార్డు. 2016లోనే రజనీకాంత్ కు దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ లభించింది. పద్మ విభూషణ్ వచ్చినా... తమిళనాడు ఎన్నికలకు సరిగ్గా ఐదు రోజుల ముందర.. ఉన్నట్టుండి ఉరుము ఉరిమినట్టు.. రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే ప్రకటించడం వెనక ఖచ్చితంగా రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు.
రజనీకాంత్ కోసం అనేక నియమ, నిబంధనలను సైతం కేంద్రం పక్కన పెట్టేసిందనే విమర్శలు వస్తున్నాయి. ఫాల్కే అవార్డుకు ఎంపిక కోసం ముగ్గురు సభ్యుల కమిటీ భేటీ అవుతుంది. దేశవ్యాప్తంగా సినిమారంగ ప్రముఖుల పేర్లను పరిశీలిస్తుంది. అందులో అత్యుత్తమ వారిని అవార్డుకు ఎంపిక చేస్తారు. అయితే, రజనీకాంత్ విషయంలో ఇలా జరగలేదు. ఫాల్కే అవార్డు ఎంపికకు ముగ్గురు సభ్యులతో కమిటీయే ఏర్పడ లేదు. ఎలాంటి సమావేశమూ నిర్వహించలేదు. ఫాల్కే అవార్డుకు ఇంకెవరి పేర్లూ పరిగణలోకి తీసుకోలేదు. అమిత్ షా, జేపీ నడ్డా, ప్రకాశ్ జవదేకర్‌లతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీనే రజనీకి ఫాల్కే అవార్డు కట్టబెట్టింది.
రజనీకాంత్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వడం వెనక బీజేపీకి పెద్ద కథే ఉందని తెలుస్తోంది. జయలలిత మరణం తర్వాత తమిళనాట రాజకీయాల్లో స్పేస్ ఏర్పడింది. దాన్ని అందిపుచ్చుకుని తమిళనాట పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. బీజేపీ ఎత్తులో భాగంగానే అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకు వెళ్లిందనే విమర్శలు ఉన్నాయి. చిన్నమ్మ జైలుకు వెళ్లిన తర్వాత ముఖ్యమంత్రి పళని స్వామి.. బీజేపీ చేతిలో కీలు బొమ్మగా మారారని అంటారు. కేంద్రం డైరెక్షన్ లోకి అన్నాడీఎంకే వెళ్లడంతో తమిళనాడులో బీజేపీ ఆడింది ఆటగా మారింది. అదే జోష్ తో అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అన్నాడీఎంకేతో కలిసి అధికారంలోకి రావాలని ప్లాన్ చేసింది. అయితే ఎన్నికలకు ముందే శశికళ విడుదల ఉండటంతో బీజేపీ ప్లాన్ బీ అమలు చేసిందంటారు. ప్లాన్ బీలో భాగంగానే రజనీకాంత్ పార్టీ తెరపైకి వచ్చిందని తెలుస్తోంది.
శశికళ కొత్త పార్టీ పెడితే అన్నాడీఎంకే మనుగడ కష్టం. ఎందుకంటే అమె టార్గెట్ పళనీ స్వామినే. ఇది గ్రహించిన బీజేపీ రజనీతో గేమ్ ఆడించిందని చెబుతున్నారు. శశికళ పార్టీ పెడితే.. దానికి కౌంటర్ గా రజనీకాంత్ పార్టీ ఉండేలా స్కెచ్ వేశారు. అందులో భాగంగానే మూడేండ్ల కింద రాజకీయ పార్టీ పెడతానంటూ ప్రకటన చేశారు రజనీకాంత్. అయితే మూడేళ్లు నాన్చుతూ వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయానికి ముందు గత జనవరిలో ఆరోగ్య కారణాలతో పార్టీ పెట్టడం లేదని ప్రకటించారు. దీనిపైనా అనుమానాలు వచ్చాయి. రజనీకాంత్ కు చాలా ఏండ్ల నుంచి ఆరోగ్య సమస్యలున్నాయి. అయినా ఆయన పార్టీ ప్రకటన చేశారు. పార్టీ ఏర్పాటు లేదని చెప్పడానికి రజనీకాంత్ ఆరోగ్య కారణాలు చూపడం అందరని ఆశ్చర్యపరిచింది. అయితే రజనీకాంత్ రాజకీయ పార్టీపై వెనక్కి తగ్గటానికి ప్రధాన కారణం.. బీజేపీతో శశికళకు డీల్ కుదరడమేనని సమాచారం.
శశికళకు తమిళనాడులో దాదాపు వెయ్యి కోట్ల రూపాయల విలువ చేస ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది. ఆ ఆస్తులను బూచీగా చూపి చిన్నమ్మను బీజేపీ బెదిరించిందని చెబుతున్నారు. ఇప్పటికే సీబీఐ, ఈడీ కేసులు ఉండటం.. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో శశికళ తలొగ్గక తప్పలేదంటున్నారు. బీజేపీ చెప్పినట్లు వినకపోతే ఆస్తులు దక్కకుండా పోవడంతో పాటు కేసులు ఎదుర్కొవాల్సి వస్తుందనే భయంతో.. ఎన్నికల్లో పోటీ యోచనను శశికళ విరమించుకున్నారని టాక్. శశికళ తప్పుకోవడంతో బీజేపీ కూటమికి పెద్ద గండం తప్పినట్లైంది. దీంతో శశికళ పార్టీకి పోటీగా ప్లాన్ బీ లో భాగంగా తెరపైకి తెచ్చిన రజనీకాంత్ పార్టీ అవసరం బీజేపీకి లేకుండా పోయింది. దీంతో మోడీ టీమ్ ఆదేశాలతోనే ఆరోగ్య కారణాలు చూపుతూ రజనీకాంత్... తన పార్టీని క్లోజ్ చేశారని అంటున్నారు.
తమిళనాడులో తమ రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ ఆడినట్లుగా గత ఐదేండ్లుగా రజనీకాంత్ నడుస్తున్నారని అంటున్నారు. అందుకే 2016లో రెండో అత్యున్నత పురస్కారం ఇచ్చిన కేంద్ర సర్కార్.. తాజాగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించిందనే విమర్శలు వస్తున్నాయి. రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ కు అవార్డులు రావడం స్వాగతించాల్సిన విషయమే అయినా.. అందులో రాజకీయ కోణం ఉండటంపై మాత్రం విమర్శలు వస్తున్నాయి. సినిమాల్లో రారాజుగా వెలిగిన రజనీ కాంత్... బీజేపీ రాజకీయ ఎత్తుల్లో బలి పశువు అయ్యారని, జనాల దృష్టిలో జోకర్ గా మిగిలిపోయారని ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతైనా సూపర్ స్టార్ రజనీ కాంత్ .. రాజకీయాల్లో జీరో గా మారిపోవడానికి బీజేపీ కుటీల రాజకీయాలే కారణమని తమిళనాట జోరుగా చర్చ జరుగుతోంది.