తెరాస ఎమ్మెల్యేల కోనుగోలుకు బేరసారాలు... అడ్డంగా బుక్కైన బీజేపీ!
posted on Oct 26, 2022 @ 10:00PM
మునుగోడు ఉప ఎన్నిక ముంగిట బీజేపీ అడ్డంగా బుక్ అయ్యింది. మునుగోడు ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలుకు తెరతీసిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ పేర బీజేపీ నుంచి నాయకుల వలసలను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో ఎలాగైనా సరే తెరాసకు షాక్ ఇచ్చి.. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కమలం గూటికి చేర్చి లెక్క సమం చేయాలని బీజేపీ చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది.
తెరాస ఎమ్మెల్యేలను కమలం గూటికి లాగేసేందుకు హస్తిన నుంచే బీజేపీ పావులు కదిపిందని చెబుతున్నారు. ఇందు కోసం బీజేపీ మఠాధిపతులను రంగంలోనికి దింపింది. హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ ఫాం హౌస్ లో రామచంద్రభారతి, సోమయాజులు స్వామి, నందకుమార్ అనే వ్యక్తులు తెరాసకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలతో బేరసారాలు ఆడుతుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా దాదాపు 15 కోట్ల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ ఫామ్ హౌజ్ లో నలుగురు తెరాస ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి లతో బేరసారాలు ఆడుతుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు.
ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించిన వారిలో రామచంద్రభారతి హస్తిన నుంచి రాగా, సోమయాజులు స్వామి తిరుపతికి చెందిన వారు. ఇక నందకుమార్ హైదరాబాద్ కు చెందిన వ్యక్తి. ఇలా ఉండగా కమిషనర్ ఆఫ్ పోలీస్ విలేకరులతో మాట్లాడుతూ.. తెరాస ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతోనే తాము వారిని ప్రలోభాలకు గురి చేస్తున్న వ్యక్తులను పట్టుకున్నామని చెప్పారు.
దీనిపై పూర్తి దర్యాప్తు చేయాల్సి ఉందని తెలిపారు. కాగా పోలీసులకు దొరికిన వారిలో హైదరాబాద్ కు చెందిన నందకుమార్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సన్నిహితుడని చెబుతున్నారు. ఇక స్వామి రామచంద్రభారతి తిరుపతి నుంచి వచ్చారనీ, స్వామి సింహయాజులు తిరుపతికి చెందిన వారనీ అంటున్నారు.