బిహార్ ప్రభుత్వ వ్యవహారాలలో వేలు పెడుతున్న లాలూ ప్రసాద్
posted on Jan 4, 2016 @ 11:47AM
బిహారు అసెంబ్లీ ఎన్నికలలో మోడీ, అమిత్ షాలను తట్టుకొని నిలబడి మళ్ళీ అధికారం దక్కించుకొనేందుకు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, అవినీతి ఆరోపణలు ఎదుర్కొని జైలుకి వెళ్ళివచ్చిన లాలూ ప్రసాద్ యాదవ్ తో చేతులు కలిపారు. ఆయన వ్యూహం ఫలించి మళ్ళీ ముఖ్యమంత్రి కాగలిగారు. కానీ లాలూ ప్రసాద్ యాదవ్ తో చేతులు కలిపినందుకు మూల్యం ఇప్పుడు చెల్లించుకొంటున్నారు.
లాలూ ఇద్దరు కొడుకులకు ఎటువంటి పరిపాలనానుభావం లేకపోయినా మంత్రి పదవులు అప్పగించవలసి వచ్చింది. అప్పటి నుంచి నితీష్ కుమార్ ప్రభుత్వం వ్యవహారాలలో లాలూ ప్రసాద్ యాదవ్ జోక్యం చేసుకోవడం మొదలుపెట్టారు. ఇది ఊహించిందే కనుక నితీష్ కుమార్ అందుకు మానసికంగా సిద్ధమయి ఉన్నారనుకోవలసి ఉంటుంది. లాలూ కొడుకులిద్దరికీ సరయిన విద్యార్హతలు, రాజకీయ, పరిపాలనానుభావం లేనందున వారికి అండగా నిలిచేందుకు ప్రభుత్వంలో తనకు విశ్వాసపాత్రులయిన ఐ.ఏ.ఎస్. అధికారులను తన కొడుకుల మంత్రిత్వ శాఖలకు ప్రధాన కార్యదర్శులుగా నియమింపజేసుకొన్నారు. కనుక సహజంగానే వారిరువురూ, వారి క్రింద పనిచేసే అధికారులు లాలూ ప్రసాద్ యాదవ్ కనుసైగలతో పనిచేస్తుంటే ఆశ్చర్యపోనవసరం లేదు.
కానీ లాలూ ప్రసాద్ యాదవ్ అంతటితో తృప్తి చెందినట్లు లేరు. నితీష్ కుమార్ కి చురకలు వేయడం మొదలుపెట్టారు. బిహార్ లో శాంతిభద్రతల పరిస్థితి చాలా వేగంగా క్షీణిస్తోందని తన పార్టీ నేతల చేత ఆరోపణలు చేయించారు. భాదిత కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయలేకపోతే వారు వచ్చి తనను కలవవచ్చని లాలూ ప్రసాద్ యాదవ్ స్వయంగా ప్రకటించారు. అంటే ఆయన సమాంతర పరిపాలన ప్రారంభించినట్లే భావించవచ్చును.
ఆయనకి ఏ అధికారం లేనప్పటికీ, నిన్న పాట్నాలోని ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సస్ ఆసుపత్రిలో ఆకస్మిక తణికీలు నిర్వహించారు. అక్కడి నుండే ఆయన వైద్య ఆరోగ్యశాఖకు మంత్రిగా చేస్తున్న తన పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ కి ఫోన్ చేసి ఆసుపత్రిలో పరిస్థితి గురించి వివరించి తరచూ దానిని తనికీ చేస్తుండాలని సలహా ఇచ్చేరు. ఎందుకంటే తేజ్ ప్రతాప్ యాదవ్ ఆ ఆసుపత్రికి చైర్ పర్సన్ కూడా కనుక. ఇంటర్మీడియేట్ పరీక్ష కూడా పాసవలేని అతను వైద్య ఆరోగ్యశాఖకు మంత్రి అవడమే విచిత్రమనుకొంటే, ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సస్, డైరక్టర్స్ బోర్డ్ కి చైర్ పర్సన్ అయ్యుండటం ఇంకా విచిత్రంగా ఉంది. ఆ విషయాన్ని అతని తండ్రి ఆసుపత్రి నుంచి ఫోన్ చెప్పడం ఇంకా విచిత్రంగా ఉంది.
లాలూ ప్రసాద్ యాదవ్ నేరుగా అధికారం చెలాయించే అవకాశం లేకపోయినప్పటికీ, ప్రభుత్వం ఆయన దయాదాక్షిణ్యాల మీదనే నడుస్తోంది కనుక ఆయన చేతులు ముడుచుకొని కూర్చొంటారని ఎవరూ అనుకోవడం లేదు. కానీ మరీ ఇంత త్వరగా ప్రభుత్వ వ్యవహారాలలో జోక్యం చేసుకొంటారని ఎవరూ అనుకోలేదు. ఆయన ఆసుపత్రి తణికీలు నిర్వహిస్తున్నప్పుడు ఆయన ఏ అధికారంతో ఆపని చేస్తున్నారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించినపుడు తానేమీ పనిగట్టుకొని తణికీలు నిర్వహించడానికి రాలేదని ఆ పక్కనే ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తనకు తెలిసిన వ్యక్తి ఒకరిని పరామర్శించడానికి వచ్చేనని, ఒకప్పుడు తన పర్యవేక్షణలో అద్భుతంగా నిర్వహించబడిన ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సస్ ఏవిధంగా ఉందో చూసిపోదామని వచ్చేనని సర్ది చెప్పుకొన్నారు.
నిజానికి లాలూ ప్రసాద్ యాదవ్ “అవును నా కొడుకు మంత్రి కనుక నేను తణికీలు నిర్వహించడానికే వచ్చేను,” బహిరంగంగా చెప్పగలరు. కానీ చెప్పలేదంటే అది నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని కనికరించినట్లే భావించవచ్చును. ఒకవేళ ఆయన ఆ విధంగా చెప్పి ఉంటే, అప్పుడు నితీష్ కుమార్ అందుకు సంజాయిషీలు చెప్పుకోలేక బాధపడవలసి వచ్చేది. అయన మద్దతుతోనే ప్రభుత్వం కొనసాగుతోంది కనుక ఆయనను ప్రశ్నించే సాహసం చేయలేకపోయేది. లాలూ ప్రసాద్ యాదవ్ చాలా లౌక్యంగా జవాబు చెప్పి నితీష్ కుమార్ ప్రభుత్వానికి అటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవకుండా దయ తలిచారని అనుకోవలసి ఉంటుంది. అందుకే ఆయన తణికీల్పి నితీష్ కుమార్ ప్రభుత్వం ఇంతవరకు నోరు మెదపలేదు. బహుశః మున్ముందు ఇటువంటి చేదు అనుభవాలు ఇంకా చాలా ఎదుర్కోవలసి రావచ్చునేమో?