బుగ్గనకు బిగ్ షాక్.. మంత్రి ఏరియాలో టీడీపీ ఘన విజయం..
posted on Nov 17, 2021 @ 10:41AM
మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఓవరాల్‌గా అధికార పార్టీదే ఆధిపత్యం అయినా.. అనేక చోట్ల వైసీపీకి ఊహించని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎంతగా దొంగ ఓట్లు వేయించుకున్నా.. ఎంతలా అధికార బలాన్ని అడ్డగోలుగా వాడేసుకున్నా.. ప్రతిపక్షంపై ఎన్ని కుట్రలు చేసి ఎంతగా కట్టుదిట్టం చేసినా.. పలు ప్రాంతాల్లో టీడీపీ విజయాన్ని అడ్డుకోలేకపోయారు.
కర్నూలు జిల్లా బేతంచెర్ల మున్సిపల్ ఎలక్షన్‌లో రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌కు భారీ షాక్ తగిలింది. బుగ్గన నివాసం ఉండే 15 వార్డులో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. వైసీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి వెంకట సాయి కుమార్ 114 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఈ గెలుపుతో టీడీపీ శ్రేణులు బేతంచెర్లలో సంబరాలు చేసుకుంటున్నాయి.
ఇప్పటికే కర్నూలు జిల్లాలో జరిగిన సర్పంచ్, వార్డులకు జరిగిన ఎన్నికల్లో కూడా వైసీపీ ఊహించని ఎదురుదెబ్బలే తగిలాయి. నంద్యాల మండలం భీమవరంలో 4వ వార్డులో వైసీపీ అభ్యర్థి నాగపుల్లారెడ్డిపై టీడీపీ అభ్యర్థి జనార్ధన్ విజయం సాధించారు. 12 ఓట్ల తేడాతో జనార్ధన్ గెలుపొందారు. నంద్యాల వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి గోకుల కృష్ణారెడ్డి సొంత వార్డులోనే ఓడిపోయారు. అలాగే ఎమ్మిగనూరు మండలం కె. తిమ్మాపురంలోనూ వైసీపీ వార్డు అభ్యర్థిపై 38 ఓట్ల తేడాతో సీపీఐ అభ్యర్థి మహేశ్వరి విజయం సాధించారు. కృష్ణగిరి మండలం లక్కసాగరం గ్రామపంచాయతీ ఎన్నికలో టీడీపీ రెబల్ అభ్యర్థి వరలక్ష్మి 858 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
ఇలా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రాతినిథ్యం వహిస్తున్న కర్నూలు జిల్లాలో అధికార వైసీపీకి షాకుల మీద షాకులు తగిలాయి. ప్రభుత్వంపై, వైసీపీ నేతలపై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా వ్యక్తమవుతోంది. ఇప్పటికే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి.. అథోగతి పాలు చేశారన్న కోపం.. ఆర్థిక మంత్రిపై చూపించినట్టున్నారు ఓటర్లు. అందుకే బుగ్గన నివాసం ఉండే వార్డులో వైసీపీని ఓడించి రివేంజ్ తీర్చుకున్నారు ప్రజలు.