బొత్సకు బిగ్‌షాక్.. వైసీపీని వీడుతున్న అనుచరులు
posted on Feb 17, 2024 8:35AM
ఏపీ రాజకీయాల్లో సుదీర్ఘకాలం అనుభవం కలిగిన నేతల్లో మంత్రి బొత్స సత్యనారాయణ ఒకరు. ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కీలక మంత్రిగా కొనసాగుతున్నారు. జగన్ కు సలహాలు, సూచనలు ఇచ్చే స్థాయి కలిగిన నేతల్లో మంత్రి బొత్స కూడా ఒకరు. మంత్రి బొత్స కుటుంబానికి విజయనగరం జిల్లాలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా అభిమాన గణం ఉంది. అయితే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో జిల్లాలో బొత్స హవాకు బ్రేకులు పడుతున్నట్లు కనిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో బొత్స కీలకంగా వ్యవహరిస్తున్నప్పటికీ ఆయన అనుచరులను కాపాడుకోవటంలో విఫలమవుతున్నారు. గత పదేళ్లకుపైగా బొత్సకు వీరవిధేయులుగా కొనసాగిన వారు సైతం మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైసీపీకి గుడ్ బై చెబుతుండటం వైసీపీ శ్రేణుల్లో ఆందోళనకు కారణమౌతుంటే.. బొత్స షాక్ కు గురౌతున్నారు. విజయనగరం ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి జిల్లాలో చక్రం తిప్పుతుండటంతో బొత్స అనుచరులుగా వారు పార్టీలో ఇమడలేక పోతున్నారని పరిశీలకులు అంటున్నారు.
సార్వత్రిక ఎన్నికలకు సమయం ముంచుకువస్తున్న తరుణంలో అనుచరులు దూరం అవుతుండటం బొత్సకు మింగుడు పడటం లేదు. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ అధినేత జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే జగన్ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పలుసార్లు సర్వేలు నిర్వహించినా వైసీపీ ఓటమి ఖాయమనే ఫలితాలే వస్తుండటంతో జగన్, వైసీపీ ముఖ్యనేతలు ఓటమి నుంచి తప్పించుకొనేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలూ గట్టిగా భావిస్తున్న నేపథ్యంలో వైసీపీలోని పలువురు నేతలు తెలుగుదేశం, జనసేన పార్టీల్లో చేరుతున్నారు. దీనికి తోడు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చుతుండటంతో వైసీపీలో వర్గవిబేధాలు తార స్థాయికి చేరుతున్నాయి. వర్గ విబేధాలకు పుల్ స్టాప్ పెట్టేందుకు వైసీపీ అగ్రనాయకత్వం రంగంలోకి దిగినా ఫలితం కనిపించడం లేదు. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పరిస్థితి ఇలాఉంటే.. విజయనగరం నియోజక వర్గంలో నేతల మధ్య ఆధిపత్య పోరు మరో లెవెల్ కు చేరింది.
విజయనగరం జిల్లాలో వైసీపీని వీడుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వీరిలో బొత్స అనుచరులు కూడా ఉండటం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి బొత్స వర్గంగా చెప్పుకునే పిళ్లా విజయ్ కుమార్, అవనాపు విజయ్ తో పాటు ఇతర ద్వితీయ శ్రేణి నాయకులు సుమారు 10వేల మంది కార్యకర్తలతో సహా తెలుగుదేశం గూటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. విజయనగరం పట్టణంలో పిళ్లా, అవనాపు కుటుంబాలకు భారీ అనుచర గణం ఉంది. వీరంతా వైసీపీని వీడితే ఆ పార్టీకి జిల్లాలో పెద్ద ఎదురుదెబ్బ ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి ఒంటెద్దు పోకడలతో పార్టీలో ఇమడలేక వారు పార్టీని వీడుతున్నారని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. బొత్స అనుచరులే పార్టీలో ఇమడలేని పరిస్థితులు ఉంటే.. ఎలా అన్న చర్చ జరుగుతోంది. ఓ విధంగా పిళ్లా విజయ్‌కుమార్, అవనాపు విజయ్ పార్టీని వీడితే సిట్టింగ్ ఎమ్మెల్యే కోలగట్ల కన్నా.. మంత్రి బొత్సకే పెద్ద మైనస్ అంటున్నారు పరిశీలకులు. అనుచరులను కాపాడుకోలేకపోయారనే అపప్రదను మంత్రి మూటగట్టుకోవాల్సి వస్తుందని అంటున్నారు.
పిళ్లా విజయ్ కుమార్, అవనాపు విజయ్, వారి అనుచరులు తెలుగుదేశంలో చేరితే పార్టీ మరింత జిల్లాలో మరింత బలోపేతం అవడం ఖాయం. తాజా పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం సీనియర్ నేత అశోక్ గజపతి వర్గీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో అశోక్ గజపతి కుమార్తె అదితి గజపతిరాజు విజయనగరం నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఈసారి మళ్లీ ఆమే బరిలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే.. ఇద్దరు బలమైన బీసీ నేతలు ఆమెకు అండగా నిలవనుండటంతో తెలుగుదేశం విజయం నల్లేరు మీద బండి నడకే అవుతుందని అంటున్నారు.