భీమవరం డీఎస్పీ జయసూర్యపై బదలీ వేటు
posted on Dec 25, 2025 @ 12:38AM
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం భీమవరం డీఎస్పీ జయసూర్యపై ఎట్టకేలకు బదలీ వేటు పడింది. ఆయన స్థానంలో రఘువీర్ విష్ణు నియమితులయ్యారు. బదలీ వేటు పడిన జయసూర్యకు డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలనిఆదేశాలు జారీ చేశారు. ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. జయసూర్య పనితీరుపై పలు విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఆయన తీరుపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు రెండు నెలల కందటే డీఎస్పీ జయసూర్య అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని పవన్ కల్యాణ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. అయితే అప్పట్లో జయసూర్యకు మద్దతుగా ఆయన సమర్ధుడైన అధికారి అంటూ ఉండి ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు కితాబివ్వడం సంచలనం సృష్టించింది.
పవన్ కల్యాణ్ ఆదేశించినా, ప్రభుత్వం విచారణ జరుగుతోందని ప్రకటించినా గత రెండు నెలలుగా డీఎస్పీ జయసూర్యపై ఎటువంటి చర్యా లేదు. ఇప్పుడు హఠాత్తుగా ఆయనపై బదలీ వేటు పడింది. అయితే జయసూర్యపై చర్యలు తీసుకునే విషయంలో ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించిందని పరిశీలకులు అంటున్నారు. జయసూర్యపై అవినీతి ఆరోపణలు అంతర్గ విచారణలో నిరూపితం కాకపోవడం వల్లనే రెండు నెలల తరువాత బదలీ వేటు వేశారనీ, ఒక వేళ ఆరోపణలు నిరూపితమై ఉంటే సస్పెండ్ చేసి ఉండేవారనీ అంటున్నారు.