ఐపీఎల్‌కు ధీటుగా ఏపీలో బెట్టింగ్! లోకేష్‌, ప‌వ‌న్‌పైనే ఫోకస్ ?

దేశవ్యాప్తంగా ఓ వైపు ఐపీఎల్ మరోవైపు ఎన్నికల కోలాహలం నెలకొంది. ఇక ఐపీఎల్‌లో జోరుగా బెట్టింగ్ నడుస్తోండగా అటు ఏపీలోనూ అదే స్థాయిలో పందెం రాయుళ్లు రంగంలోకి దిగారు. దీంతో ఏపీ ఎన్నికలపై బెట్టింగ్‌లు ఊపందుకున్నాయి. అభ్యర్థుల గెలుపు, ఓటమి అంచనాలు, ఎన్నికల్లో మెజారిటీపై బెట్టింగ్‌ జోరుగా సాగుతోంది. ఈ ఎన్నికలు పూర్తిగా "జగన్ గెలుపు - జగన్ ఓటమి" పైనే జరుగుతున్నాయని ప్ర‌జ‌ల్లో చర్చ జ‌రుగుతోంది.  బెట్టింగ్ యాప్స్ లో కూడా ఇదే అంశం ప్రధానంగా తీసుకోవడం ఆసక్తిగా మారింది. ప్రభుత్వ ఏర్పాటు, వచ్చే సీట్లు, ఆయా అభ్యర్ధుల గెలుపు, వారి మెజారిటీలపై భారీగా బెట్టింగ్ జరుగుతోంది. సర్వేల ఆధారంగా పార్టీల గెలుపుపై పందేలు కాస్తున్న పరిస్థితి. ఒకటి రెండింతులు, మూడింతలుగా బెట్టింగ్ కాసేందుకు పందెం రాయుళ్లు సిద్ధమయ్యారు. బుకీలు కూడా బెట్టింగ్స్‌కు సంబంధించిన దుకాణాలు తెరిచారు. వేల కోట్ల రూపాయలు చేతులు మారే ఈ బెట్టింగ్ బిజినెస్ ఏపీలో అడ్డూ అదుపూ లేకుండా కొన‌సాగుతోంది.

బెట్టింగ్ ఈ అంశాల‌పై జ‌రుగుతోంది. 

1) వైసీపీ గెలుస్తుందా లేదా, ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు?

2) కుప్పంలో చంద్రబాబు గెలుస్తారా?  మెజార్టీ ఎంత వ‌స్తుంది?

3) మంగళగిరిలో నారా లోకేష్ గెలుస్తారా? మెజార్టీ ఎంత వ‌స్తుంది?

4) పవన్ కళ్యాణ్ పిఠాపురంలో విజయం సాధిస్తారా? లేక అక్కడ వంగా గీత గెలుస్తారా?

5) హిందూపూర్‌లో బాల‌కృష్ణ‌కు మెజార్టీ ఎంత వ‌స్తుంది?

6) పులివెందులలో గ‌త ఎన్నిక‌ల‌కంటే మెజారిటీ తగ్గుతుందా? లేదా?

7) కడప ఎంపీ బరిలో ఉన్న షర్మిల విజయం సాధిస్తారా? 

8) భీమిలిలో గంట శ్రీనివాసరావు గట్టెక్కుతాడా? 

9) రాజంపేటలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి విజయం సాధిస్తాడా? 

10)  వైసీపీ ఎన్ని సీట్లు గెలుస్తుంది?

11)  కూటమికి ఎన్ని సీట్లు వ‌స్తాయి?

మంగ‌ళ‌గిరి, పుంగ‌నూరు, చంద్ర‌గిరి, విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌, విజ‌యవాడ వెస్ట్‌, అన‌కాప‌ల్లి, ఫిఠాపురం,  రాజ‌మండ్రి, హిందూపూర్‌, కుప్పం, పీలేరుతో స‌హా ఏపీలోని 30 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో బెట్టింగ్ జోరుగా న‌డుస్తోంది.  గ్రామాలు, ప‌ట్ట‌ణాల‌నే  తేడా లేదు. పెద్ద ఎత్తున బెట్టింగ్ కాసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా కీలక నేతలు పోటీ చేసే నియోజకవర్గాల్లో బెట్టింగ్ కోట్ల రూపాయ‌ల్లోనే జరుగుతుందని చెప్పుకోవాలి.

జగన్ మళ్లీ సీఎం అవుతాడా లేదా అనే దానిపై పెద్ద ఎత్తున బెట్టింగ్ జరుగుతోంది. ఇక వైసీపీ ఎన్ని సీట్లు గెలుస్తుంది, కూటమికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, జనసేనాని పవన్ ఈసారి అసెంబ్లీలో అడుగు పెడతారా, ఈసారి పులివెందులలో జగన్ మెజారిటీ తగ్గుతుందనే అంశం బెట్టింగ్ రాయుళ్లు జోరుగా పందెం కాస్తున్నారు. ఐపీఎల్‌కు ధీటుగా ఏపీ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ జరుగుతుండటం విశేషం.

- ఎం.కె.ఫ‌జ‌ల్‌

Teluguone gnews banner