జాతీయ రాజకీయాలపై బెంగాల్ ఫలితాల ప్రభావం?
posted on May 8, 2021 @ 3:34PM
ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు చేసే వాగ్దానాలు, పలికే ప్రగల్బాలు ఎలాఉన్నా అంతిమంగా ప్రజలు ఇచ్చే తీర్పే ప్రజాస్వామ్య మనుగడకు మూల ఔషదంగా నిలుస్తుంది. ప్రజాస్వామ్యాన్ని బతికిస్తుంది. నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు జరిగిన ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన తీర్పు నిస్సందేహంగా ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేసింది. అందులో ఏ మాత్రం సందేహంలేదు. ముఖ్యంగా అధికారాన్ని ఎవరికీ ఇచ్చిన ప్రతిపక్షాన్ని విస్మరించలేదు. ప్రజాస్వామ్యం మనుగడకు ప్రతిపక్షాల అవసరాన్ని ప్రజలు గుర్తించారు. ఇదొక శుభ పరిణామం.
ఎన్నికలు జరిగన ఐదు రాష్ట్రాలలో మూడు రాష్ట్రాలు అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళలలో ఓటర్లు అధికార పార్టీకి మళ్ళీ మరో అవకాశం ఇచ్చారు. అస్సాంలో బీజేపీ, బెంగాల్లో తృణమూల్, కేరళలో వామపక్షకూటమి అధికారాన్నినిలబెట్టుకున్నాయి.తమిళనాడులో,అన్నాడీఎంకే,పుదుచ్చేరిలో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయాయి.డిఎంకే అధినాయకుడు కరుణానిధి,అన్నా డిఎంకే అధినాయకురాలు జయలలిత లేకుండా జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో, ఎంకే స్టాలిన్ సారధ్యంలోని డిఎంకే అధికారాన్ని హస్త గతం చేసుకుంది. పుదుచ్చేరీలో బీజేపీ సారధ్యంలోని ఎన్డీఎ అధికారంలోకి వచ్చింది. పుదుచ్చేరీలో బీజేపీ బలం నామమాత్రమే. 30 స్థానాలున్న అసెంబ్లీలో బీజేపీకి దక్కింది ఆరు స్థానాలు మాత్రమే. అయితే బీజేపీ మిత్ర పక్షం ఎన్ఆర్సీ 10 స్థానాలు గెలుచుకుంది. దాంతో, తొలిసారిగా, బీజేపీ శాసనసభలో అడుగుపెట్టింది. అది కూడా అధికార పార్టీగా ఎంట్రీ ఇచ్చింది. అలాగే, ఉత్తరాది పార్టీగా అక్కడి ప్రజలు ఇంతవరకు దూరం పెట్టిన, ద్రవిడ రాష్ట్రం తమిళనాడులో డిఎంకేతో పొత్తు పెట్టుకున్న బీజేపీ ఇన్నేళ్ళలో తొలిసారిగా నాలుగు స్థానాలు గెలుచుకుంది. సంఖ్యా పరంగా చూస్తే, ఇదేమంత గొప్ప విజయం అనిపించుకోదు, కానీ, ఇంతవరకు ఉనికే లేని తమిళ రాజకీయాల్లో అంతో ఇంతో స్థానం సంపాదించుకోవడం చెప్పుకో దగ్గ విశేషమే. పొరుగున ఉన్న కేంద్ర పాలిత ప్రాంతంలో అధికారంలోకి రావడం ఒక విధంగా విశేషమే.
అందరి చూపు బెంగాల్ పై కేంద్రీకృతం కావడంతో, మిగిలిన రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు పక్కకు పోయి, బెంగాల్ ఒక్కటే, నేషనల్ ఫోకస్’లోకి వచ్చింది.అయితే, బెంగాల్ విషయంలోనూ, బీజేపీ అధికారంలోకి రాలేదన్న ఆనందమో మరేమో గానీ, చాలా వరకు మీడియా సంస్థలు, రాజకీయ విశ్లేషకులు బెంగాల్లో బీజేపీ బలం గణనీయంగా పెరిగిందనే వాస్తవాన్ని విస్మరిస్తున్నారు. అలాగే, రాష్ట్రాన్ని సుమారు 60 ఏళ్లకు పైగా పాలించిన కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు నామరూపాలు లేకుండా తుడిచి పెట్టుకో పోయాయి అనే విషయాన్ని కూడా మేధావులు, విశ్లేషకులు అంతగా పట్టించుకోవడం లేదు. బహుశా ఆ రెండు పార్టీలను మేథావులు, విశ్లేషకులు చరిత్రలో కలిపెసారో ఏమో..
అదలా ఉంచి బీజేపీ విషయానికి వస్తే ఐదేళ్ళ క్రితం, 2016లో కేవలం మూడంటే మూడు అసెంబ్లీ స్థానాలలో మాత్రమే విజయం సాధించిన బీజేపీ ఈ ఎన్నికలలో అదే మూడు తక్కువ 80 స్థానాల్లో (77) విజయం సాధించింది. అదే సమయంలో గత ఎన్నికల్లో 70 స్థానాలో గెలిచిన కాంగ్రెస్, కమ్యూనిస్ట్ కూటమి కనీసం ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేక పోయింది. అసెంబ్లీలో ప్రతిపక్ష స్థానాన్ని కమల దళం పూర్తిగా కబ్జా చేసింది. ఇది కూడా మాములు విజయం కాదు. అసలు ఉనికే లేని చోట ఇతర ప్రతిపక్షాలను పూర్తిగా భూస్థాపితం చేసి, అధికార పార్టీకి ప్రధాన ప్రత్యర్ధిగా ఎదిగి రావడం సామాన్య విషయం, సాధారణ విజయం కాదు. అయితే, సంవత్సరం క్రితం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 18 స్థానాలు గెలుచుకోవడంతో , ఆ ఫలితాలతో పోల్చుకుని బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశించిన కమల దళం అభిమానులకు, బీజేపీ అధికారంలోకి వస్తుందని భయపడిన మిత్రులకు మాత్రం నిరాశే మిగిలింది.
లోక్ సభ ఎన్నికల నుంచి బెంగాల్లో బీజేపీ అసెంబ్లీ ఎన్నికలపై ఆశలు పెంచుకుంది. అధికారం కోసం ‘అతిగా’ శ్రమించింది. ప్రధాని నరేంద్ర మోడీ, హోమ్ మంత్రి, పార్టీ ప్రధాన వ్యూహ కర్త అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇంకా అనేక మంది కేంద్ర మంత్రులు, ఇతర అగ్ర నేతలు, చాలా ముమ్మరంగా ప్రచారం సాగించారు. ముఖ్యంగా అమిత్ షా 200 ప్లస్ మంత్రంతో సాగించిన ప్రచారం ఫలించక పోవడంతో, బీజేపీ ఓడి పోయిందనే భావన ఏర్పడింది. కానీ, నిజానికి ఓడి పోయింది కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు, తృణమూల్ అధికారాన్ని నిలుపుకుంది. బీజేపీ ఒక్కటే బలాన్ని పెంచుకుంది.
ఒక్క బెంగాల్ లోనే కాదు మొత్తంగా చూసినా, ఈ ఎన్నికలలో ఎక్కువగా లాభపడిన, బలపడిన పార్టీ బీజేపీ. అస్సాంలో అధికారం నిలుపుకుంది. పుదుచ్చేరీలో అధికారంలోకి వచ్చింది. బెంగాల్లో బలమైన ప్రతిపక్షం స్థాయికి ఎదిగింది. తమిళనాడులోనూ, ‘ఉన్నాను’ అనుపించుకుంది. ఒక్క కేరళలో మాత్రమే ఉన్న ఒక్కసీటును కూడా నిలుపుకోలేక పోయింది. మరో వంక కాంగ్రెస్ పార్టీ పుదుచ్చేరిలో అధికారం కోల్పోయింది. కేరళలో ఆనవాయితీకి భిన్నంగా కాంగ్రెస్ సారధ్యంలోని యూడీఎఫ్ కూటమి ఓడి పోయింది. గత లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 20 స్థానాలకు గానూ 15 స్థానాలలో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ, అసెంబ్లీ ఎన్నికల్లో చతికిల పడింది. తమిళనాడులో, డిఎంకే మిత్ర పక్షంగా కొద్దిగా మెరుగైన ఫలితాలు సాధించింది. కొద్దిపాటి ఊరట లభించిది.
జాతీయ రాజకీయాలను విశ్లేషించుకుంటే జాతీయ స్థాయిలో బీజేపీ ప్రత్యాన్మాయంగా నిలవగలిగే జాతీయ పార్టీ, ప్రస్తుతానికి అయితే ఏదీ లేదు. అది బెంగాల్లో మమత అయిన మరో రాష్ట్రంలో మరో పార్టీ అయినా బీజేపీకి ప్రాంతీయ పార్టీలే ప్రధాన ప్రత్యర్ధి పార్టీలు. బెంగాల్లో, బీజేపీ ఓటమికి ఇంకా చాలా కారణాలు ఉన్నా, ముఖ్యమంత్రి ‘చెహరా’ ముఖం లేక పోవడం కూడా ఒక ప్రధాన కారణం. లోక్ సభ ఎన్నికల్లో, ప్రతిపక్షాల పరిస్థితి కూడా అదే. అదీగాక, పరిణతి చెందిన భారతీయ ఓటరు ఏ ఎన్నికలకు ఆ ఏన్నికల్లో ప్రత్యేకంగానే తీర్పు నిస్తున్నారు. కాబట్టి, బెంగాల్లో, ఆశించిన ఫలితాలు సాధించలేక పోయింది కాబట్టి, బీజేపీ పనైపోయిందని అనుకోవడం రాజకీయ విజ్ఞత, వివేకం అనిపించుకోదు. అలాగే, బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని అనుకోలేము. రాజకీయాలు నిశ్చలన చిత్రాలు కాదు.. చలనచిత్రాలు ఏఆటీఆఊడూ సీన్ మారుతూ ఉంటుంది. అందుకే రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చని అంటారు.