భవానీపూర్ లో మమత రికార్డ్ విజయం..
posted on Oct 3, 2021 @ 4:43PM
పశ్చిమ బెంగాల్‌లోని భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో తృణామూల్ కాంగ్రెస్ అభ్యర్థి, ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఘన విజయం సాధించారు.తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి ప్రియాంకపై 58,389 ఓట్ల ఆధిక్యంతో ఆమె గెలుపొందారు. భారీ మెజార్టీతో బెంగాల్ లో తన రికార్డును తానే బద్దలు కొట్టుకున్నారు మమతా బెనర్జీ. 2011 శాసన సభ ఎన్నికల్లో వామపక్షాలను మమత బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఓడించింది. 34 ఏళ్ళ వామపక్షాల పాలనకు తెరదించిన ఆ ఎన్నికల్లో ఆమె 49,936 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. తాజాగా భవానీ పూర్ ఉప ఎన్నికలో ఆ రికార్డును ఆమె తిరగరాశారు.
2016లో భవానీపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియరంజన్ దాస్‌మున్సి భార్య దీపా దాస్‌మున్సీ చేతిలో 25,301 ఓట్ల తేడాతో మమతా బెనర్జీ ఓడిపోయారు. అనంతరం 2011లో జరిగిన ఎన్నికల్లో సీపీఎం నేత నందిని ముఖర్జీపై 54,000 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ ఏడాది మార్చి-ఏప్రిల్‌లో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన మమతా బెనర్జీ.. బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే ఆమె నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆమె ముఖ్యమంత్రి అయ్యారు. 6 నెలల లోపు ఆమె ఎమ్మెల్యే కావాల్సి ఉంది. తాజా విజయంతో మమత ముఖ్యమంత్రి పదవికి చిక్కులు తొలగిపోయాయి. ముర్షీదాబాద్ జిల్లాలో షంషేర్ గంజ్, జంగీపూర్ శాసన సభ నియోజకవర్గాల్లోనూ టీఎంసీ విజయం సాధించింది.
తన విజయంపై స్పందించారు మమతా బెనర్జీ. నందిగ్రామ్ కుట్రకు భవానీపూర్ గట్టి సమాధానం చెప్పిందని వ్యాఖ్యానించారు.‘‘దేశంలోని తల్లులకు, సోదరసోదరీమణులకు అందరికీ కృతజ్ణతలు. 2016లో కొన్ని వార్డుల్లో మాకు అనుకూలంగా ఓట్లు వచ్చాయి. భవానీపూర్‌లో 46 శాతం బెంగాల్‌కు చెందని వారే ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరు నాకు ఓటు వేశారు. ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి మమ్మత్ని అధికారం నుంచి తప్పించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక కుట్రలకు పాల్పడుతోంది. నా కాలికి కూడా గాయమైంది. మాపై ప్రజలు ఉంచిన విశ్వాసానికి గర్వంగా ఉంది. ఆరు నెలలలోపు ఎన్నికలు నిర్వహించిన ఎన్నికల కమిషన్‌కు కృతజ్ణతలు’’ అని మమతా బెనర్జీ అన్నారు.
తన ఓటమిపై బీజేపీ అభ్యర్థి ప్రియాంక స్పందించారు. ఓటమిని హుందాగా స్వీకరిస్తున్నానని అన్నారు. అయితే ఈ ఆటలో తాను ''మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్''గా నిలిచానని చెప్పారు. మమతా బెనర్జీకి గట్టిపట్టు ఉన్న నియోజకవర్గంలో తాను పోటీ చేసి, 25,000కు పైగా ఓట్లు గెలుచుకున్నానని, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచానని అన్నారు. మునుముందు మరింత కష్టపడి పనిచేస్తానని చెప్పారు.