ప్రధాని మోడీ కాళ్లు మొక్కుతా! మమత బెనర్జీ సంచలనం..
posted on May 29, 2021 @ 5:00PM
కొత్త ప్రభుత్వం ఏర్పడినా పశ్చిమ బెంగాల్ లో రాజకీయ మంటలు చల్లారడం లేదు. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా.. దానికి రాజకీయం పులుముకుంటోంది. యాస్ తుపానుపైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య యుద్ధం సాగుతోంది. యాస్ తుపాను సమీక్ష సమావేశం సందర్భంగా చోటు చేసుకున్న వివాదంలో కేంద్రం తనపై నిందలు మోపడం పట్ల బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రధాని మోడీని 30 నిమిషాల పాటు వేచి చూసేలా చేశారని కేంద్రం.. మమతపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై ఘాటుగా స్పందించిన మమత... ఇటీవల బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకే కేంద్రం ఈ విధంగా ప్రవర్తిస్తోందని విమర్శించారు. తమను ఓడించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించిన కేంద్రం పెద్దలు, దారుణంగా భంగపడ్డారని, అప్పట్నించి ప్రతి రోజు ఏదో ఒక వివాదం రేకెత్తిస్తున్నారని, తనను ప్రతిసారీ అవమానిస్తున్నారని మమత మండిపడ్డారు.
మే 28న జరిగిన సంఘటనలను వివరించారు దీదీ. యాస్ తుపానువల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు తాను సాగర్, డిఘా వెళ్ళాలని నిర్ణయించుకున్నానని, దీనికి సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేసుకున్నానని చెప్పారు. ఆ తర్వాత అకస్మాత్తుగా ఓ ఫోన్ కాల్ వచ్చిందన్నారు. తుపాను తర్వాతి పరిస్థితిని పరిశీలించేందుకు ప్రధాన మంత్రి బెంగాల్ వస్తున్నట్లు చెప్పారన్నారు. అందుకు అనుగుణంగా తాము ప్రణాళికను రచించామని చెప్పారు. తాము ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలవడానికి ముందు ఒక గంటపాటు తమను వేచి ఉండేలా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అధికారులు చేశారన్నారు. పీఎం హెలికాప్టర్ వస్తుందని చెప్పారని, తాము సహనంతో వేచి చూశామని చెప్పారు. ప్రధాన మంత్రి-ముఖ్యమంత్రి సమావేశం జరిగే ప్రదేశానికి తాము చేరుకునేసరికి, అక్కడ మోదీ సమావేశం అంతకుముందే ప్రారంభమైపోయిందని చెప్పారు. సమావేశం జరుగుతోంది కాబట్టి మీరు వెళ్ళకూడదని చెప్పారని, తనను బయటే నిలిపేశారని తెలిపారు. అప్పుడు కూడా తాము సహనంతో వేచి చూశామన్నారు. ఆ తర్వాత మళ్ళీ తాను అడిగినపుడు మరో గంట వరకు ఎవరూ లోపలికి వెళ్ళకూడదని చెప్పారన్నారు. ప్రధాని సమావేశం రాజకీయ సమీకరణాలు సరిచేసేందుకే అన్నట్టుగా సాగిందని, విపక్ష బీజేపీని సమావేశానికి పిలవడం ఏంటని ఆమె ప్రశ్నించారు. బెంగాల్‌కు సాయం చేయాలంటే తన కాళ్ళు పట్టుకోవాలని మోదీ చెబితే, తాను బెంగాలీల కోసం తప్పకుండా ఆయన కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నానని మమత బెనర్జీ చెప్పారు. రాష్ట్రంలో ఓటమిని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు.
ప్రధాన మంత్రి-ముఖ్యమంత్రి సమావేశం జరుగుతుందని అంతకుముందు చెప్పారన్నారు. ఈ సమావేశంలో ఇతరులు కూడా పాల్గొనడంతో నివేదికను సమర్పించాలని తాను నిర్ణయించుకున్నానని చెప్పారు. ఆ తర్వాత ప్రధాన మంత్రి వద్ద అనుమతి తీసుకుని తాను డిఘాలో తుపాను వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు వెళ్ళానని వివరించారు. తాను ప్రధాన మంత్రి అనుమతిని మూడుసార్లు కోరానని చెప్పారు. ‘‘సార్, మీ అనుమతితో నేను వెళ్ళవచ్చునా? మేం డిఘా వెళ్ళి, తుపాను నష్టాన్ని అంచనా వేయవలసి ఉంది, వాతావరణం కూడా అంత బాగా లేదు’’ అని తాను మోడీతో చెప్పానని తెలిపారు. ఆ తర్వాత మాత్రమే తాము అక్కడి నుంచి డిఘా వెళ్ళామని తెలిపారు. ఆ సమావేశ మందిరంలో కొన్ని ఖాళీ కుర్చీలు ఉన్నాయని, అయితే తాము డిఘా వెళ్ళవలసి ఉన్నందువల్ల అక్కడ కూర్చోవలసిన అవసరం తమకు రాలేదని చెప్పారు. అక్కడ ఖాళీ కుర్చీలు ఉన్నట్లు ఓ ఫొటోను మీడియాకు విడుదల చేశారని, ఇది సరైనది కాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిసారీ తనను ఇలాగా టార్గెట్ చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి గుజరాత్, ఒడిశా, ఇతర రాష్ట్రాల్లో సమీక్షా సమావేశాలు నిర్వహించినపుడు ప్రతిపక్షాల సభ్యులు హాజరు కాలేదని గుర్తు చేశారు. కానీ బెంగాల్‌లో మాత్రం ప్రతిపక్ష నేతలు పాల్గొన్నారన్నారు.
కేంద్ర ప్రభుత్వం సెలక్టివ్ న్యూస్‌తో తనను లక్ష్యంగా చేసుకుందని మమత ఆరోపించారు. ఆ వార్తలు ఏకపక్షంగా ఉన్నాయని, అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి వీల్లేకుండా రాశారని ఆరోపించారు. తనకు జాతీయ స్థాయి మీడియాలో కొందరు మిత్రులు ఉన్నారని, కొన్నిసార్లు తమకు పీఎంఓ నుంచి సూచనలు వస్తూ ఉంటాయని వారు చెప్పారని అన్నారు. తనపై పక్షపాతంతో కూడిన వార్తలను రాయాలని పీఎంఓ నుంచి ఆదేశాలు వస్తూ ఉంటాయని వారు చెప్పారన్నారు. ఆ వార్తల ఆధారంగా తనను అవమానించేందుకు ఇటువంటి సూచనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. శుక్రవారం కూడా ఇదేవిధంగా సెలక్టివ్ న్యూస్ ఇచ్చి, కేంద్ర ప్రభుత్వం తనను టార్గెట్ చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కేంద్ర సర్వీసుల్లోకి పిలిపించారని, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరుతున్నానని చెప్పారు బెంగాల్ ముఖ్యమంత్రి.