దారుణం.. బ్లాగర్ తల నరికి.. తుపాకితో కాల్చి చంపారు
posted on Apr 7, 2016 @ 3:02PM
దేశాలను గడగడలాడిస్తున్న ఐసిస్ ఉగ్రవాదులు రాక్షసత్వానికి హద్దులు లేకుండా పోతున్నాయి. తమకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే చాలు అతికిరాతకంగా వారిని చంపేసి అక్కసు వెళ్లగక్కుకుంటారు. ఇప్పటికే సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా పోస్టులు చేసేవాళ్లని చాలామందినే చంపారు. ఇప్పుడు బంగ్లాదేశ్లోలో బ్లాగర్స్ హత్యల పరంపరలో మరో ఘటన వెలుగుచూసింది. నజిముద్దీన్ సమద్ అనే కుర్రాడు అత్యంత దారుణంగా చంపబడ్డాడు. వివరాల ప్రకారం.. నజిముద్దీన్ సిల్హెట్ నుంచి ఇటీవల ఢాకా వచ్చి జగన్నాథ యూనివర్సిటీలో అతను న్యాయశాస్త్రాన్ని అభ్యసిస్తున్నాడు. అయితే అతనిపై నలుగురు దాడి చేసి ఒకడు కత్తితో అతని తల నరికేయగా, మరొకడు పిస్టల్‌తో కాల్చి చంపారు. దీంతో నజిముద్దీన్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అయితే నజిముద్దీన్ తన ఫేస్ బుక్ లో దేశం గురించి.. చట్టాల గురించి.. ఇస్లామిక్ గురించి ఎప్పుడూ ఏదో ఒకటి ప్రస్తావిస్తూనే ఉంటాడు. ఈ నేపథ్యంలోనే అతనిని చంపారా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇంకా దీనిపై ఇంతవరకు బాధ్యత ప్రకటించుకోలేదని ఢాకా మెటోపాలిటన్ డీసీపీ సయెద్ నురుల్ ఇస్లాం తెలిపారు.
ఇందిలా ఉండగా వరుస బ్లాగర్ల హత్యలతో బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది. 2013 ఫిబ్రవరి 5న రాజిబ్ హైదర్ అనే సెక్యులర్ బ్లాగర్‌ను ఆయన ఇంటికి సమీపంలోనే దారుణంగా హతమార్చారు. 2015లో మరో నలుగురు బ్లాగర్లు అవిజిత్ రాయ్, వశీకర్ రహ్మన్ బాబు, అనంత బిజోయ్, నీలోయ్ ఛటర్జీలను అతి కిరాతకంగా చంపారు.