అసమ్మతికి సంకేతం బండి వ్యాఖ్యలు
posted on Nov 6, 2023 @ 2:13PM
కరీంనగర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్న బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ నేడు(నవంబర్ 6) కరీంనగర్ మహాశక్తి దేవాలయాన్ని సందర్శించారు. ఆలయంలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం తన నివాసానికి వచ్చి అక్కడ తన మాతృమూర్తికి పాదాభివందనం చేశారు.
కరీంనగర్ నియోజకవర్గంలో మంత్రి గంగుల కమలాకర్ పై బిజెపి బండి సంజయ్ ని మరోసారి బరిలోకి దింపింది. దీంతో సంజయ్ నామినేషన్ వేసేందుకు సిద్దమయ్యారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే గంగుల కమలాకర్ పై ఓటమిపాలైన సంజయ్ వెనక్కి తగ్గలేదు. అదిష్టానాన్ని ఒప్పించి లోక్ సభ టికెట్ దక్కించుకున్నాడు. ఎంతో కష్టపడి ఏ మాత్రం ఆశలులేని చోట బిజెపిని గెలిపించి సత్తాచాటాడు. ఇలా ఎంపీగా గెలిచి బిజెపి కేంద్ర నాయకత్వం దృష్టిలో పడ్డారు సంజయ్. ఈ క్రమంలో తెలంగాణ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారిపోయి బిజెపిలో సంజయ్ కీలక నాయకుడిగా మారిపోయాడు. రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సంజయ్ తెలంగాణ బిజెపిలో మంచి ఊపు తీసుకువచ్చారు. ఇటీవలే సంజయ్ ని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించినా కేంద్ర జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది బిజెపి.
ఇదే సమయంలో బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.కరీంనగర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ... తనకు పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన తర్వాత తెలంగాణలో బీజేపీను పరుగులు పెట్టించానన్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దుబ్బాక, జీహెచ్ఎంసీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించిందని గుర్తు చేశారు. పార్టీ బలోపేతం కోసం తెలంగాణవ్యాప్తంగా 150 రోజుల పాటు ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించినట్లు చెప్పారు.
కేసీఆర్ పాలనలో ప్రశ్నాపత్రాల లీకేజీ జరిగిందని, వీటికి వ్యతిరేకంగా పోరాడితే తనపై 30 అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. తనపై మతతత్వ ముద్ర వేసే ప్రయత్నాలు కూడా జరిగాయన్నారు. ధర్మం కోసం పోరాడేది కేవలం బీజేపీ మాత్రమే అన్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, తాను ధర్మం కోసమే పోరాడుతున్నామన్నారు. తామిద్దరు ఎప్పుడూ కాషాయజెండాను వదిలి పెట్టలేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు ఒక్కొక్కరు పది ఓట్లు వేయించాలని పిలుపునిచ్చారు.