కర్ఫ్యూని క్యాష్ చేసుకుంటున్న టీఆర్ఎస్
posted on Apr 29, 2021 @ 11:07AM
ఒక వైపు కరోనా మహమ్మారి దాడి. మరో వైపు హాస్పిటల్స్ లో పేషేంట్స్ ఆర్తనాదాలు. ఇంకో వైపు ప్రజల ఆర్థిక ఇబ్బందులు. మరోవైపు శవాల గుట్టలు. ఇది ఎప్పుడు మన దేశం లో నిత్యం జరుగుతుంది. కరోనా కట్టడికోసం దేశంలో పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూను విధించాయి. ఆ నైట్ కర్ఫ్యూని కూడా కొంత మంది క్యాష్ చేసుకుంటున్నారు. ఈ సమయాన్ని ఆసరా చేసుకుని పలువురు అక్రమార్కులు వ్యాపారం మొదలుపెట్టారు.
అది భీమ్‌గల్ పట్టణం. ఈ పట్టణ కేంద్రంలో కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. అక్రమంగా ఇసుక తవ్వకాలు చేస్తూ అధికారులకు సవాల్ విసురుతున్నారు. కరోనా విజృంభన నేపథ్యంలో రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. కానీ, 8 తర్వాత వ్యాపారాలు, ప్రజలు రోడ్ల మీదకు రావడం లేదని స్యాండ్ మాఫీయా గ్యాంగ్ రెచ్చిపోతోంది. రాత్రి అయ్యిందంటే చాలు ఎడ్ల బండ్ల సహాయంతో ఇసుకను నింపి వేరే చోట డంప్ చేస్తున్నారు. అదే సమయంలో అమ్మకాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
అధికార పార్టీ నాయకుడి హస్తం..
అక్రమ ఇసుక రవాణా అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి కనుసన్నల్లో జరుగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. పోలీస్ స్టేషన్‌కు కూత వేటు దూరంలోనే ఈ తతంగం నడుస్తున్నా ఎవరూ కూడా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టి అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు వేడుకుంటున్నారు. కర్ఫ్యూ సమయంలోనే ఇలా చేస్తే.. సాధారణ సమయంలో పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.