జగన్ తో ఢీ అంటే ఢీ.. బాలినేని తెగించేశారు!?
posted on Dec 13, 2023 @ 12:12PM
బాలినేని శ్రీనివాసరెడ్డి.. ఏపీలో రాజకీయాలతో ఏ కొంచం పరిచయం ఉన్నవారికైనా బాగా తెలిసిన పేరు. మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేనికి వైసీపీ పొమ్మనలేక పొగపెడుతోందని ఇంత వరకూ పరిశీలకులు ఆయనకు పార్టీలో ఎదురౌతున్న అవమానాలు, అధిష్టానం ఆయన పట్ల వ్యవహరిస్తున్న తీరును పేర్కొంటూ విశ్లేషణలు చేస్తూ వచ్చారు. అయితే ఇక ఇప్పుడు బాలినేని బాహాటంగా వైసీపీపై తిరుగుబాటు చేసేశారు. అలా అనేకంటే జగన్ పై తిరుగుబాటు ప్రకటించేశారు అనడం సరిగ్గా ఉంటుంది.
గత కొంత కాలంగా బాలినేనిని పార్టీ అధిష్ఠానం అడుగడుగునా అవమానిస్తూ వచ్చింది. ఆయన అలిగి మీడియాకు ఎక్కగానే తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించుకుని బుజ్జగిస్తూ వస్తోంది. పదే పదే ఇలా జరగడంతో వైసీపీ మెడపట్టి బయటకు గెంటేస్తుంటే.. బాలినేని చూరుపట్టుకు వేళాడుతున్నారా అన్న అనుమానాలూ వ్యక్తం చేశారు. అసలు వైసీపీలో బాలినేని ఎపిసోడ్ కు ఇంత ప్రాధాన్యత ఎందుకు వచ్చిందంటే ఆయన పార్టీ అధినేత జగన్ కు బంధువు. ఆ కారణంగానే బాలినేనికి సంబంధించిన ఏ చిన్న అంశానికైనా రాజకీయ వర్గాలూ, మీడియా కూడా అంత ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. ఇప్పుడిక బాలినేని రెఢీ అయిపోయారు. వైసీపీతో, ఆ పార్టీ అధినేతతో యుద్ధానికి సిద్ధమైపోయారు. తాజాగా ఆయన తనకు తాను పార్టీ టికెట్ ప్రకటించుకుంటూ చేసిన ప్రకటన ఒక విధంగా జగన్ కు సవాల్ విసిరినట్లుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇంత కాలం ఉత్తుత్తి బుజ్జగింపులతో కాలం గడిపేసిన అధిష్ఠానానికి ఇక ఆ ఆవకాశం లేకుండా బాలినేని సవాల్ ఉంది. ఇప్పుడిక బంతి వైసీపీ కోర్టులో ఉంది. జగన్ కు బాలినేనిని పార్టీ నుంచి బహిష్కరించడమో.. లేక ఆయనను పార్టీ ఒంగోలు అభ్యర్థిగా ప్రకటించడమో తప్ప మరో ఛాయస్ లేకుండా పోయింది.
తన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకున్న బాలినేని.. ఆ సందర్భాన్నే తన బలాన్ని ప్రదర్శించేందుకు వేదికగా ఉపయోగించుకున్నారు. ఆ వేదికపై నుంచీ ఒంగోలు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉండేది తానేనని ప్రకటించేశారు. తన అభ్యర్థిత్వాన్నే కాకుండా ఒంగోలు ఎంపీ అభ్యర్థి ఎవరో కూడా ఆయనే ప్రకటించేశారు. ఒంగోలు నుంచి ఎంపీగా మాగుంట శ్రీనివాసులరెడ్డి పోటీ చేస్తారని చెప్పారు. బాలినేని చేసిన ఈ ప్రకటన వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. పార్టీతో సంబంధం లేకుండా, పార్టీ పెద్దలతో, మరీ ముఖ్యంగా జగన్ తో కనీసం చర్చించకుండా, సంప్రదించకుండా బాలినేని చేసిన పోటీ ప్రకటన.. ఆయన ఇక తాడో పేడో తేల్చేసుకోవడానికి రెడీ అయిపోయారని స్పష్టం చేసింది. అలాగే బాలినేనికి ఇప్పటి వరకూ ప్రకాశం జిల్లాలో అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్న వైవీ సుబ్బారెడ్డికీ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. అన్నిటికీ మించి వైసీపీకి ఇప్పటికే ఉన్న రెబల్ రఘురామ రాజు తరహాలో మరో రెబల్ ఉద్భవించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఒంగోలు అభ్యర్థిని తానేనని బాలినేని ప్రకటించిన తరువాత ఇక ఆయనకు గత్యంతరం లేని స్థితిలో పార్టీ టికెట్ ఇచ్చినా? లేక ధిక్కారాన్ని సహింతునా? అన్నట్లు పార్టీ నుంచి బహిష్కరించినా జగన్ కు జగన్ పార్టీకీ ఇబ్బందులు తప్పవనీ, పార్టీని, పార్టీ అధినేతను ఇరుకున పెట్టేలా బాలినేని ఇక విమర్శలు గుప్పించడం ఖాయమనీ అంటున్నారు. జగన్ చేజేతులా పార్టీలో మరో రఘురామరాజు వంటి రెబల్ ను తయారు చేసుకున్నారనీ, ముందుముందు అందుకు ఫలితం అనుభవించక తప్పదనీ అంటున్నారు.