హిందూపురం నుంచి బాలయ్య పోటీ..రాణించగలడా?
posted on Apr 12, 2014 @ 5:10PM
నందమూరి బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈనెల 16వ తేదీన బాలకృష్ణ నామినేషన్ వేయడానికి సన్నాహాలు కూడా జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో నలుగుతున్న ఒకే ఒక ప్రశ్న ‘‘బాలకృష్ణ పాలిటిక్స్ లో రాణించగలడా?’’. బాలకృష్ణ స్వతహాగా తన తండ్రి మాదిరిగానే ఆవేశపరుడు. జీవితంలో ఎప్పుడైనా ఆవేశాన్ని ప్రదర్శించిన సందర్భాలే తప్ప రాజకీయాలు నడిపిన దాఖాలు లేని వ్యక్తి. అలాంటి వ్యక్తి రాజకీయాలలో ఎంతవరకు రాణించగలడన్న సందేహాలు కలుగుతున్నాయి.
అలాగే సినిమా రంగంలో పొగడ్తలు అందుకుంటూ పెరిగిన బాలకృష్ణ రాజకీయ రంగంలో మీదపడే విమర్శలను తట్టుకోగలరా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. తన ‘కప్ ఆఫ్ టీ’ కాని విషయంలోకి బాలకృష్ణ అత్యుత్యాహంతో ఎంటరవుతున్నాడా అన్న అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. రాజకీయాలు నడపటంలో సిద్ధహస్తుడైన తెలుగుదేశాధినేత చంద్రబాబునాయుడు కూడా ఇప్పుడు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల ధాటికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అలాంటి వాతావరణంలోకి బాలకృష్ణ వచ్చి ఎలా నిలదొక్కుకుంటాడని జనం అనుకుంటున్నారు.
అదీ కూడా చంద్రబాబు వద్దన్నా వినకుండా బాలకృష్ణ ఎన్నికలలో పోటీ చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీనితోపాటు ఆయన రాజకీయాల కోసం తన సినిమా కెరీర్‌ని పణంగాపెడుతున్నారన్న ఆందోళన కొంతమంది అభిమానులలో వుంది. చాలాకాలం తర్వాత బాలకృష్ణకి ‘లెజెండ్’ రూపంలో భారీ విజయ అందింది. ఈ ఉత్సాహంలో కెరీర్‌లో మరింత ముందుకు వెళ్ళే అవకాశాలున్నాయి. వాటిని కాదనుకుని రాజకీయాల్లోకి దిగితే అది బాలకృష్ణ కెరీర్ మీదే ప్రభావం చూపించే ప్రమాదం వుందని భయపడుతున్నారు. ఎవరు ఎన్ని అనుకున్నా బాలకృష్ణ రాజకీయాల్లో రాణించడగలడా లేదా అనే విషయం అతి కొద్దికాలంలోనే తేలిపోనుంది.