రెండో జాబితాలో కూడా బాలయ్య పేరు లేదే!!!
posted on Apr 12, 2014 @ 10:34AM
తెదేపా విడుదల చేసిన తాజా జాబితాలో కూడా నందమూరి బాలకృష్ణ పేరు కనబడక పోవడం చాలా ఆశ్చర్యం, అనుమానం కూడా కలిగిస్తోంది. అందుకు తగ్గట్టే బాలయ్య కూడా తను అవసరమనుకొంటే ఈసారి ఎన్నికలలో పోటీ చేయకుండా పార్టీ తరపున ఎన్నికల ప్రచారం చేస్తానని ప్రకటించడం ఆ అనుమానాలను బలపరుస్తోంది. అయితే, ఈసారి విడుదల చేసిన జాబితాలో కూడా బాలయ్య పోటీ చేద్దామని భావిస్తున్న హిందూపురం నుండి ఎవరిపేరు ప్రకటించకపోవడంతో బాలయ్య పోటీ చేసే అవకాశాలున్నట్లు భావించవలసి వస్తోంది. కానీ హరికృష్ణ కూడా ఈసారి అసెంబ్లీకే పోటీచేయాలని భావిస్తునందున మరి ఆయనకీ టికెట్ ఇస్తారో లేదా అనే సంగతి కూడా ఇంకా తేలవలసి ఉంది. ఈరోజు సీమంద్రాలో ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడుతోంది గనుక, టికెట్ దొరికిన అభ్యర్ధులు నామినేషన్లు వేయవడం మొదలు పెట్టవచ్చును. ఈనెల 19వరకు నామినేషన్లు వేయడానికి గడు ఉన్నపటికీ మధ్యలో మూడు రోజులు శలవులు కారణంగా 18వ తేదీతోనే నామినేషన్లకు గడువు ముగుస్తుంది. అందువలన తెదేపాతో సహా మిగిలిన అన్ని పార్టీలు ఈ ఒకటి రెండు రోజుల్లోనే తమ తమ అభ్యర్ధుల తుది జాబితాలను విడుదల చేయవలసి ఉంది.