జగన్ సర్కార్ కు షాక్.. అయ్యన్నకు రిమాండ్ తిరస్కరించిన మేజిస్ట్రేట్
posted on Nov 3, 2022 @ 7:21PM
తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ అయ్యన్న పాత్రుడి అరెస్టు విషయంలో జగన్ సర్కార్ కు షాక్ తగిలింది. అయ్యన్న పాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్ రిమాండ్ కు విశాఖ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు నిరాకరించింది. వెంటనే బెయిలు మంజూరు చేసింది.
ఈ కేసులో నిందితులపై మోపిన ఐపీసీ 467 సెక్షన్ వర్తించదని పేర్కొంటూ కేసు కొట్టేసింది. సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేసి తదుపరి చర్యలు చేపట్టాలని సీఐడీని కోర్టు ఆదేశించింది. అయ్యన్న పాత్రుడు అరెస్టును తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారు. జగన్ హయాంలో జరుగుతున్న అరాచకపాలనకు ఈ అరెస్టు పరాకాష్టగా అభివర్ణించారు.
ప్రభుత్వానికి ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు తప్పుడు కేసులు పెట్టి విపక్ష నేతలను అరెస్టు చేసి ప్రజల దృష్టిని మరల్చడం ఒక అలవాటుగా మారిపోయిందన్నారు. వివేకా హత్య కేసులో జగన్ రక్తం పంచుకుపుట్టిన స్వంత చెల్లి సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారనీ, ఆ వాంగ్మూలంలో తన బాబాయ్, మాజీ మంత్రి వివేకాను ఎవరు చంపారో స్పష్టంగా చెప్పారని, దీంతో జగన్ దిక్కు తోచని పరిస్థితుల్లో పడ్డారని అన్నారు. ఆ విషయం గురించి ప్రజల దృష్టి మళ్లించడానికే అయ్యన్న పాత్రుడిని అర్ధరాత్రి దాటిన తరువాత అమానుషంగా అరెస్టు చేసి ఈడ్చుకెళ్లారని చంద్రబాబు దుయ్యబట్టారు. విశాఖలో భూ కబ్జాల వ్యవహారంపై తెలుగుదేశం పోరాడుతోందనీ, దాని నుంచి కూడా దృష్టి మరల్చాలనే అయ్యన్న పాత్రుడిపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారన్నారు.