కుప్పం టు ఇచ్ఛాపురం.. లోకేష్ పాదయాత్ర
posted on Oct 7, 2022 @ 11:17AM
వైయస్ జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరకతను తమ వైపు మళ్లించుకోనేందుకు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా జగన్ గెద్దె నెక్కిన వెంటనే ప్రజా వేదిక కూల్చివేయడం నాటి నుంచి.... నేటి వరకు ఈ ప్రభుత్వం చేపడుతోన్న ప్రజా వ్యతిరేకత విధానాలను ప్రజల్లోకి చాలా బలంగా తీసుకు వెళ్లాలని... అలా అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర చేపట్టే విధంగా చంద్రబాబు రంగం సిద్దం చేశారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. పాదయాత్ర 2023 జనవరి 26వ తేదీన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చంద్రబాబు స్వంత నియోజకవర్గమైన కుప్పంలో ప్రారంభమై.. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వరకూ సాగేలా ప్రణాళిక రూపొందించినట్లు చెబుతున్నారు. దాదాపు 450 రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది. ముందుగా అనుకున్న మేరకు లోకేష్ పాదయాత్ర ఇప్పటికే ప్రారంభించాలని చంద్రబాబు భావించారని.. కానీ ఎన్నికలకు దాదాపు ఏడాదిన్నర సమయం ఉండడంతో, పాదయాత్ర ప్రారంభ తేదీని జనవరి 26 నుంచి ప్రారంభించాలని నిర్ణయించారని చెబుతున్నారు. లోకేష్ పాదయాత్ర తెలుగుదేశం పార్టీకి అన్ని విధాలా కలిసి వస్తుందని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం.
అయితే ఈ పాదయాత్ర వల్ల తెలుగుదేశం పార్టీ పటిష్టం కావడమే కాకుండా.. నారా లోకేశ్‌పై అధికార పార్టీకి చెందిన నేతలు చేసిన వ్యతిరేక ప్రచారాన్ని సైతం తిప్పికొట్టాలని, అలాగే నారా లోకేశ్ సామర్థ్యం ప్రజలందరికీ తెలిసేలా ఉండాలన్న లక్ష్యంతో చంద్రబాబు లోకేష్ పాదయాత్ర విషయంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే లోకేశ్ పాదయాత్ర.. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల మీదగా సాగేలా.. ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.
పాదయాత్ర రూట్ మ్యాప్, సాగాల్సిన తీరు, ఆయా నియోజకవర్గాలలో పాదయాత్రను సక్సెస్ చేసే బాధ్యతలు ఎవరికి అప్పగించాలి అన్నవి ఇంకా ఖరారు కావాల్సి ఉంది. అయితే రూట్ మ్యాప్ ఖరారుకు ముందు చంద్రబాబు పార్టీలోని కీలక నేతలతో సమావేశమై, పాదయాత్రపై కూలంకషంగా చర్చించనున్నారు. ఆ క్రమంలో ఒక్కో నియోజకవర్గం నుంచి దాదాపు వెయ్యి మంది తక్కువ కాకుండా ఈ భేటీకి హాజరుకాబోతున్నారని తెలుస్తోంది. మరోవైపు.. ఎన్నికల్లో గెలుపు కోసం పలు పార్టీలు వ్యూహాకర్తలను ఆశ్రయిస్తుంటే... చంద్రబాబు మాత్రం తన వ్యూహాలనే నమ్ముకుని పక్కాగా ముందుకు సాగుతున్నారు.