రౌడీలకు రౌడీని.. వైసీపీపై‘చంద్ర’నిప్పులు
posted on Aug 25, 2022 7:36AM
తెలుగుదేశం అధినేత చంద్రబాబు వైసీపీపై చండ్ర నిప్పులు చెరిగారు. కుప్పం పర్యటనలో భాగంగా ఆయన పర్యటించే దారిలో వైపీసీ జెండాలు కట్టడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో రాష్ట్రానికి జరిగిన మేలు ఒక్కటీ లేదన్నారు. కోడి కత్తి డ్రామాలు, ఊరూరా రౌడీలను తయారు చేయడం తప్ప.. రోడ్లపై ఒక్క గుంత కూడా పూడ్చిన పాపాన పోలేదన్నారు. రౌడీలను తయారు చేసుకుని తెలుగుదేశం పార్టీని భయపెట్టాలనుకుంటే అది సాధ్యం కాదని హెచ్చరించారు. తాను రౌడీలకు రౌడీనని హెచ్చరించారు.
సొంత నియోజకవర్గం కుప్పంలో ఆయన మూడ్రోజుల పర్యటన బుధవారం ప్రారంభమైంది. తొలి రోజు రామకుప్పం మండలంలోని కొంగనపల్లె, కొళ్లుపల్లె, శివునికుప్పం, చల్దిగానిపల్లెల్లో పర్యటించారు. రామకుప్పంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. తాను పులివెందులను కుప్పంగా మార్చాలనుకున్నాననీ, కానీ జగన్ కుప్పాన్ని కూడా పులివెందుల్లా మార్చేస్తున్నారనీ విమర్శించారు.
పులివెందులలోనే వైసీపీని సమాధి చేస్తానని హెచ్చరించారు. నువ్వు అక్కడ పులివో.. పిల్లివో తేల్చుకుందాం అంటూ జగన్‌కు సవాల్ విసిరారు. సీఎం జగన్ మేనమామ కారు చౌకగా 8,500 ఎకరాల భూమి కొట్టేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ఎంపీ బట్టలిప్పి తిరిగితే చర్యలు తీసుకోకుండా, అతడిపై ఫిర్యాదు చేసిన తమ వాళ్లపై సిగ్గుఎగ్గూ లేకుండా కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. ఎవరైనా కులం పేరు ఎత్తితే చెప్పుతో కొట్టండి’ అని పిలుపిచ్చారు. అభివృద్ధిని పాతరేసి, అమరావతిని నిర్వీర్యం చేసి ఏపీలో జగన్ పాలన అధ్వానం అని విమర్శించారు.